పక్షం రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యచరణ
– మున్సిపల్ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 10(జనంసాక్షి): 15రోజుల్లో జీహెచ్‌ఎంసీ కార్యాచరణను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మంత్రి విూడియా సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి సూచనలు చేశామని తెలిపారు. యూఎఫ్‌ఐడీసీ ద్వారా నిధులు సమాకూర్చుకోవాలని నిర్ణయించిన్టటు తెలిపారు. 30రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. దీని కోసం కఠిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జీహెచ్ ఎంసీలో ఏం చేయబోతున్నామో అజెండా రూపంలో ప్రకటిస్తమని తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని అభివృద్ది పనులపై అధ్యయనం చేసి ఇక్కడ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ రంగాల నిపుణులతో మంత్రులు, కార్పోరేటర్లకు శిక్షణ ఇస్తమని తెలిపారు. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లుండవని స్ఫష్టం చేశారు. మెరుగైన పౌర సౌకర్యాలను వెంటనే చేపట్టేందుకు గాను 100రోజుల ప్రణాళిక రూపొందించాల్సిదిగా రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మాత్యులు కె.టి.రామారావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజల మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన పౌర సౌకర్యాలను వెంటనే చేపట్టేందుకు గాను 100రోజుల ప్రణాళిక రూపొందించాల్సిదిగా రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మాత్యులు కె.టి.రామారావు అన్నారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం నేడు జిహెచ్‌ఎంసి, మున్సిపల్, హెచ్‌ఎండిఏ, హెచ్‌ఎంఆర్, వాటర్ వర్క్స్ తదితర శాఖల సవిూక్ష సమావేశం బుద్దపూర్ణిమ కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, హెచ్‌ఎంఆర్ ఎండి ఎస్.వి.ఎస్.రెడ్డి తదితరులు ఈ సవిూక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి కె.సి.ఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తశుద్దితో ప్రణాళికాబద్దంగా పనిచేయాలని అధికారులను కోరారు. నగరంలో వెంటనే ప్రజల అవసరాలను తీర్చేందుకు జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాలు వంద రోజుల ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఈ స్వల్పకాలిక ప్రణాళికతో పాటు వచ్చే మూడేళ్లలో చేసే పనులపై మద్యంతర ప్రణాళిక, రానున్న ఐదు నుండి పదేళ్లలో పూర్తిచేసే పనుల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందంచాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చి నగరవాసులు తమపై కోటి ఆశలతో ఉన్నారని, నగరవాసల మనోభావాలను ప్రతిబింభించేలా పనిచేయాలని కోరారు. పౌరసేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేపట్టడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్, లీవబుల్ నగరంగా చేయాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు రూపొందించే పథకాలన్నింటిలో నగర ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలని సూచించారు. నగరంలోని 24 సర్కిళ్లలో టౌన్‌హాల్ విూటింగ్‌లను నిర్వహించి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, బస్తీ కమిటీల సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని 150డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూప్ రూపొందించి ఆ గ్రూప్‌లో అధికారులందరిని చేర్చాలని సూచించారు. ఆయా డివిజన్ల సమస్యలపై ఆయా గ్రూప్‌లోని అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలను అధికారులు మాత్రమే నడిపిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని, దీనిని దూరంచేసి ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలని అన్నారు. పురపాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, నగరంలో రోడ్లపై ఏర్పడే గుంతలు, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ప్రత్యేక ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు. నగరంలో భవన నిర్మాణ అనుమతులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే అందించాలని, ఇందుకు గాను ముందుగా ఒక సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి రెండు లేదా మూడు కిలోవిూటర్లకు ఒక అధికారిని ఇన్‌చార్జీగా నియమించి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని తెలిపారు. మూసినది ప్రక్షాళనకు చేపట్టాల్సిన మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, జలమండలి, మెట్రోరైలు, మెప్మా, కులికుద్బుషా నగరాభివృద్ది సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్లీన్, గ్రీన్, సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్
మున్సిపల్ శాఖలో అన్ని విభాగాలు, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం దిశగా చర్యలు ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సచివాలయంలో తన శాఖ అధికారులతో తొలి సవిూక్షా సమావేశం నిర్వహించారు. తక్షణ చర్యగా వంద రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమను నమ్మి ఓట్లేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను తు.చ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్ ను క్లీన్, గ్రీన్, సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా చర్యలు ఆరంభించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచేలా చర్యలు చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను తు.చ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ముందుగా ప్రజల్లో విశ్వాసం కలిగించేలా వంద రోజుల ప్రణాళిక వేసుకుని చర్యలు చేపడతామన్నారు. తక్షణ చర్యలుగా నాలాల క్లీనింగ్, దోమల బెడద తప్పించడం, తాగునీటి సమస్యలను నివారించాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలను కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించాలన్నారు. టెక్నాలజీని వాడుకోవడంతో ప్రజలకు మరింత చేరువ కావచ్చన్నారు. మున్సిపల్ శాఖలో పరిపాలన వికేంద్రీకరణ కోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలన్నారు. యూనిట్ల వారిగా విభజించి, ఉద్యోగులకు పనులు అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితికి అలసత్వమే కారణమని, ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ కఠినంగా ఉండాల్సిందేనని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ స్థలాలు, ఫుట్ పాత్ లు లేకపోవడం వంటివి విశృంఖలత్వానికి ఉదాహరణ అన్నారు. భవిష్యత్ లో అక్రమ భవన నిర్మాణాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాల అమలులో కఠినంగా ఉండే సమయం ఆసన్నమైందన్నారు. త్వరలో వివిధ శాఖలను కలుపుకుని 150 డివిజన్లలో వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం పెంచేదిశగా కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్.. తొలి సవిూక్షా సమావేశానికి గుర్తుగా ట్యాంక్ బండ్ పైన ఉన్న బుద్ధపూర్ణిమ ప్రాంగణంలో మొక్కను నాటారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, మెట్రో రైలు, టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.