పగడ్బందీగా గ్రూప్-2 పరీక్షలు
ఆదిలాబాద్,జూలై 20 : ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 21,22 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5 వేల 838 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీటికి ఆదిలాబాద్ 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా, ప్రతి రెండు పరీక్షా కేంద్రాలకు ఫ్లైయింగ్‌స్వాడ్ అధికారులను నియమించామని అన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టిక్కెట్ ఉన్నవారినే కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ప్రత్యేక బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.