పట్టాలపై పరుగుకు మెట్రో సిద్ధం

 

– నవంబర్‌ 28న ముహూర్తం

– ప్రారంభోత్సవానికి ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌,,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): నగరవాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి మియాపూర్‌ వరకు 30 కిలోవిూటర్ల పరిధిలో నవంబర్‌ నెల నుంచి మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ మేరకు నవంబర్‌ 28న మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఈ మేరకు దీనిని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖను ఐటీ, మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ గురువారం ట్వీట్‌ చేశారు. మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా 25-5-2017న వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేసిన సీఎం కేసీఆర్‌.. నవంబర్‌లో ఇందుకోసం రావాలని ఈ లేఖలో కోరారు. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అతిపెద్ద ప్రాజెక్టుగా.. హైదరాబాద్‌ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని లేఖలో పేర్కొన్నారు. నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సదస్సును ప్రారంభించడానికి ఇప్పటికే ప్రధాని ఒప్పుకున్న నేపథ్యంలో ఇదే పర్యటనలో భాగంగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ మోదీని కోరారు.