పట్టాలు తప్పిన యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌


ముగ్గురు మృతి..30మందికి గాయాలు
చెన్నయ్‌, ఏప్రిల్‌ 10 (ఎపిఇఎంఎస్‌): ముజాఫర్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాయవేలూరు జిల్లా సిట్టేరి గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 30మందికి గాయా లయ్యాయి. గాయపడిన వారిని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ముజాఫర్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు, రైల్వే సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని ఎసీ బోగీలకు ఉన్న అద్దాల కిటికీలను పగులగొట్టి వాటి ద్వారా ప్రయాణీకులను వెలుపలకు చేర్చారు. రైల్వే రెస్యూ టీమ్‌ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తోంది. రైలు పట్టాలకు మరమ్మతులు నిర్వహిస్తోంది.

ఆరు రైళ్లు రద్దు..

యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురవ్వడంతో ఆ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నయ్‌-బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నయ్‌-కోయంబత్తూరు దురంతో ఎక్స్‌ప్రెస్‌, చెన్నయ్‌-కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో మూడు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. బుధవారం మధ్యాహ్నంలోగా పరిస్థితి చక్కబడుతుందని, ఆ తర్వాత రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి, రేణిగుంట, చెన్నయ్‌, తదితర ప్రాంతాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. గాయపడిన వారిని చెన్నయ్‌, బెంగళూరు ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు తెలిపారు.