పఠాన్‌కోట్‌కు ఐఎస్‌ఐని ఎలా ఆహ్వానించావ్‌?

1

– ప్రధానిది 100 రెట్లతప్పు

– ఆప్‌ ఎంపీ మాన్‌

దిల్లీ,జులై 26(జనంసాక్షి): పార్లమెంటు సముదాయాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం తాను చేసిన తప్పయితే, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరానికి పాక్‌ ఐ.ఎస్‌.ఐ.ని ఆహ్వానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీది అంతకంటే 100 రెట్ల పెద్ద తప్పు అని ఆప్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. తాను చేసింది తప్పో కాదో తేల్చడానికి లోక్‌సభ స్పీకర్‌ నియమించిన క్రమశిక్షణ సంఘం… ప్రధానినీ పిలిపించి విచారించాలని మంగళవారం ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఆయనొక లేఖ రాశారు. ‘2001లో పార్లమెంటు సముదాయంపై ఐ.ఎస్‌.ఐ. దాడి చేసింది. అదే ఐ.ఎస్‌.ఐ. ఈ ఏడాది పఠాన్‌కోట్‌ స్థావరంపై దాడికి దిగింది. అలాంటివారిని ప్రధాని ఆహ్వానించి, స్థావరం చూపించారు. ఆ స్థావరం పటాలను రూపొందించుకుని ఐ.ఎస్‌.ఐ. వెళ్లిపోయింది. నేను తీసిన వీడియో కంటే ఇది దేశ భద్రతకు ముప్పు కాదా? నేను దోషినైతే ప్రధాని కూడా వందరెట్లు పెద్ద దోషి. ఆయన్నీ కమిటీ పిలిపించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.