పత్తిరైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు
కొనుగోళ్లపై ఎమ్మెల్యే జోగురామన్న హావిూ
ఆదిలాబాద్,అక్టోబర్ 4(జనంసాక్షి): ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తిరైతులకు మద్దతు ధరలు చెల్లించి కొనుగోళ్లకు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ యేడు మరింత పక్కగా ఏర్పాట్లుజరుగుతన్నాయని అన్నారు. రైతులు తమ పత్తిని, ఇతర పంటలను ఎక్కడైనా విక్రయించు కోవచ్చని, ఆవిషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పారు. రైతుల అభిష్టం మేరకు పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, సౌకర్యాలు, తూకంలో, ధరలో దగా వంటివి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీనికితోడు కొనుగోళ్లను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. మార్కెట్ కొనుగోళ్లలో పారదర్శకత కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్వయంగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రూ.5కే భోజనంతో పాటు ఉచితంగా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు తేమను సాకుగా చూపుతూ యార్డులో ఒకశాతం, జిన్నింగులో మరో రకం తేమశాతం నమోదు చేస్తూ ధరలో భారీగా కోతవిధిస్తున్నారని రైతులు వాపోయారు. యార్డుల్లోనూ సమయపాలన పాటించక పోవడంతో రైతులకు అదనపు భారం పడుతోందని, నిరంతరంగా సమయంతో సంబంధం లేకుండా యార్డుకు వచ్చిన వాహనాలను తూకం చేసి ధర నిర్ణయించాలని పేర్కొన్నారు. ప్రధానంగా వ్యాపారులు వాడే తేమ యంత్రాలపై అనుమానాలు ఉన్నాయని, నిపుణుల సమక్షంలో యంత్రాలను పరిశీలించి మార్కెట్‌యార్డు వారు సరఫరా చేసినవే వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహజంగా వచ్చే తేమను పత్తి కొనుగోళ్లప్పుడు నిబంధనల సాకుతూ కొనుగోళ్లకు నిరాకరించడం తగదని పేర్కొన్నారు. పత్తిని నేరుగా విక్రయించేవారికి దళారులతో సంబంధం లేకుండా చూడాలన్నారు. ఆన్‌లైన్ విధాన కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని, ఈ విధానంలో రైతులకు నష్టం జరగకుండా తగుచర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్లలో మోసాలు జరగకుండా రైతులతో కూడిన కమిటీని వేయాలన్నారు. తేమ నిబంధనలు గతంలాగే ఉంటాయని రైతులు గమనించాలని అధికారులు సూచించారు. పత్తిని నేరుగా విక్రయించే రైతులకు దళారుల బెడద లేకుండా చూడాలని, వారి సరకును ఖరీదుదారులకు విక్రయించి డబ్బులు ఇప్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో మార్కెటింగ్ అధికారులు సహకరించకపోతే ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. తేమ యంత్రాలను నిపుణుల
చేత పరిశీలన జరిపించాకే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.