పత్తి మద్ధతు ధర పెంచండి

5

– వారానికి కనీసం 5 రోజులైనా కొనండి

– కేంద్ర మంత్రి సంజయ్‌ పాండాతో మంత్రి హరీశ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 3(జనంసాక్షి):

పత్తికి మద్దతు ధర రూ.4,100 నుంచి రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పత్తిరైతులకు ప్రస్తుత ధర గిట్టుబాటు కావడం లేదని అందువల్ల ధరను పెంచాలని కోరినట్లు  ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగలవారం ఆయన  కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ పాండాతో భేటీ అయ్యారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇందులోభాగంగా మద్దతు ధరలను పెంచాలని కోరామని పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారని కనీసం ఐదు రోజులు పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. గతేడాది ఈ సమయానికి లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే ఈయేడాది 15 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. 84 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 45 పత్తి కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. అందుకే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. కొనుగోలు చేసి పత్తి తేమ శాతాన్ని 12 నుంచి 20 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర . ఈ సమావేశం సందర్భంగా మొక్కజొన్నకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర కార్యదర్శిని మంత్రి కోరారు. పౌరసరఫరాలకు సంబంధించిన మరిన్ని అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. హరీష్‌రావుతోపాటు ఎంపీలు వినోద్‌, జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌ కార్యదర్శి వ్రిందాను కలిసిన వారిలో ఉన్నారు.