పత్తి రైతులకు అండగా నిలవాలి

వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. కొత్తగా నియమితులైన మార్కెట్‌ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని అన్నారు. తమది రైతు ప్రభుత్వమని చెపుతూ మోసం చేస్తుందని ఆరోపించారు. రబీ కోసం రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నా విత్తనాలు సరఫరా చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైన తరుణంలో ప్రభుత్వం మరింతజాగ్రత్తగా కొనుగోళ్లను చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో పత్తికి మంచి గిరాకీ ఉండటంతో రైతులంతా ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గుచూపనున్నారు. బహిరంగ మార్కెట్‌లో రైతుకు ధర లభించనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించుతారని అన్నారు. రైతులు దగా పడకుండా ఓ వైపు పత్తి కోతలు మొదలైనా ఇంకా కేంద్రాల ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇది సరికాదని,రైతులకు నష్టంకలగకుండా కొనుగోళ్లను పర్యవేక్షించాలని రేవూరి సూచించారు.

తాజావార్తలు