పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు
యధావిధిగా వేధిస్తున్న మార్కెట్ సమస్యలు
మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు
ఆదిలాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. తాజాగా మళ్లీ పత్తినే వేయాలన్న డిమాండ్‌తో రైతులు అటువైపే మొగ్గుచూపారు. రైతులు పండిరచిన పంటలను దళారులకు విక్రయించి నష్టపోకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరలు
చెల్లించి కొనుగోళ్లు చేపట్టినా పంట చేతికొచ్చే సమయంలో ధరలు ఉండడం లేదు. ఇటీవల పత్తి ధరలు పెరగడానికి సీజన్ అయిపోవడమే కారణంగా చూడాలి. సీజన్‌లో పత్తిని కొనుగోలు చేసే బాధ్యత సీసీఐకి అప్పజెప్పగా జిల్లాలోని భైంసా, నిర్మల్ పట్టణాల్లో సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ అధికారుల సమన్యయంతో కొనుగోళ్లు ప్రారంభించారు. అంతేకాకుండా పత్తిని విక్రయించేందుకు రైతులు మార్కెట్‌కు తీసుకెళ్లే సమయం లో వెంట పట్టాదార్ పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు జిరాక్స్‌లతో పాటు సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రాన్ని రైతులు సమర్పిస్తే సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గ దర్శకాలు విడుదల చేసింది. అలాగే ఇతర రాష్టాల్ర పత్తి మన రాష్ట్రంలో విక్రయించకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ పోలీస్ శాఖ సమన్వయంతో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రైతుల వద్ద మార్కెటింగ్ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్ళ లేక దళారులు అడిగినంత ధరకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. సీసీఐ వారికి విక్రయించకుంటే ఆర్థికంగా పెద్ద మొత్తం లో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్లిన సమయంలో రైతు సమర్పించిన పట్టాదార్ పాసు పుస్తకంలోని సర్వే నెంబర్ లో పత్తిని పండిరచినట్లు ఆన్‌లైన్‌లో నమోదై ఉండకపోతే మార్కెటింగ్ సిబ్బంది పత్తిని కొనుగోలు చేయడం లేదు. అదేవిధంగా జూన్, జూలై మాసాల్లో రైతులు విత్తనాలు వేసిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ఏ సర్వే నెంబర్‌లో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారు.. అనే వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అందులో ఇతర పంటలు వేసినట్లు నమోదై ఉంటే ఆ పత్తి ని కొనుగోలు చేయడం లేదు. దీనితో రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే సమయంలో రైతు లు పండిరచే పంటలకు బీమా చేయాల్సి ఉంటుంది. కాగా వరి, మొక్కజొన్న పంటలకు హెక్టారుకు రూ.1750 బీమా ప్రీమియం చెల్లిస్తుండగా పత్తికి రూ.3800 చెల్లించాల్సి రావడంతో అధిక శాతం రైతులు బీమా ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు వరి, మొక్కజొన్న పంట పండిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు చెప్పడంతో ప్రస్తుతం ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది.