పథకాల అమలు షురూ..

` రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్‌ కార్డుల
జారీ ప్రక్రియ ప్రారంభం
` 4,41,911 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు
` ఎంపిక చేసిన 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ
` మొదటిరోజు 15,414 కొత్త రేషన్‌ కార్డులు జారీ
` పాత రేషన్‌ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లు
` 501 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభమైంది.
` మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదల
` అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్‌(జనంసాక్షి): రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 15,414 కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ‘కొత్త కార్డుల్లో 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్‌ పంపిణీ చేస్తాం. తొలి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశాం. పాత రేషన్‌ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేర్చారు. 501 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభమైంది. మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదలయ్యాయి‘ అని తెలిపారు. ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మలచెప్పారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6 వేలు ఖాతాల్లో పడతాయని వివరించారు. సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అందుకు రూ.21 వేల కోట్లు చెల్లించామని ప్రకటించారు. పథకాల అమలు నిరంతర పక్రియ అని అన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరవుతాయని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు.

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో పిటిషన్‌
` కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం
` 129 మున్సిపాలిటీల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలకు అందించాలని వినతి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు.భూమి లేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని.. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు.రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని చెప్పారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ 4 వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.