పదో తరగతిలో బాలికలదే హవా


88.08 శాతం పాస్‌
మెరుగైన సర్కారీ స్కూళ్లు
మంచి ఫలితాలు సాధించిన ఏపీఎస్‌డబ్ల్యూ పాఠశాలలు
పది రోజుల ముందే ఫలితాలు ప్రకటించిన మంత్రి పార్థసారథి
హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) :
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మళ్లీ బాలికలదే పైచేయిగా నిలిచింది. 88.90శాతంతో బాలికలు ప్రధమస్థానంలో నిలవగా, 87.30శాతం ఉత్తీర్ణతతో బాలురు ద్వితీయస్థానంలో నిలిచారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఎస్‌సీ ఫలితాలను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది టెన్త్‌ ఫలితాలు గత ఫలితాలకంటే ముందుగా వెలువరించామన్నారు. అందుకు కృషి చేసిన ఎస్‌ఎస్‌సి బోర్డు అధికారులను, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ప్రయివేటు విద్యార్థులు కలిపి మొత్తం 11,92,076మంది పరీక్షలు రాశారని.. వారిలో 9,24,779మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 88.08శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే 0.24శాతం అధికమని అన్నారు. అలాగే ప్రైవేటు విద్యార్థులు 1,42,174మంది పరీక్ష రాయగా వారిలో 64,699మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 45.50శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 0.67శాతం అధికమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 172 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని 1,103 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. అలాగే మునిసిపల్‌ పాఠశాలల్లోని అయిదు పాఠశాలలు మాత్రమే నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయని వివరించారు. 144 గురుకుల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను గ్రేడ్లు వారీగా నెట్‌లో పొందుపరిచామని తెలిపారు.
చిత్తూరు జిల్లా ఫస్ట్‌..
ఎస్‌ఎస్‌సి పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి పార్ధసారధి తెలిపారు. 94.92శాతం ఉత్తీర్ణతను చిత్తూరు జిల్లా విద్యార్థులు సాధించారన్నారు. ఆఖరి స్థానంలో మెదక్‌ జిల్లా నిలిచిం దన్నారు. 67.96శాతం ఉత్తీర్ణతను మాత్రమే మెదక్‌ జిల్లా విద్యార్థులు సాధించారని తెలిపారు. ద్వితీయ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచిందన్నారు. ఆ జిల్లా విద్యార్థులు 94.04శాతం సాధించారని వివరించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. కడప, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలు నిలిచాయి.
15 నుంచి సప్లిమెంటరీ..
ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్‌ 15వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించ నున్నట్టు మంత్రి పార్ధసారధి తెలిపారు. జూన్‌ 15వ తేదీతో ప్రారంభమైన పరీక్షలు అదే నెల 28వ తేదీతో ముగియనున్నట్టు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజును జూన్‌ ఒకటో తేదీలోగా ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని కోరారు. దరఖాస్తులను పూర్తి చేసి ఆయనకే అందజేయాలని కోరారు.
గ్రేడ్లు లెక్కింపు ఇలా..
ఫస్ట్‌, థర్డ్‌, నాన్‌ లాంగ్వెజీల్లో.. 92-100 మధ్య ..సెకండ్‌ లాంగ్వేజ్‌లో 90-100 మధ్య వస్తే గ్రేడ్‌ ‘ఎ1’
83-91 మధ్య… సెకండ్‌ లాంగ్వేజ్‌లో 80-89 మధ్య వస్తే గ్రేడ్‌ ‘ఎ2’
75-82 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 70-79 మధ్య వస్తే గ్రేడ్‌ ‘బి1’
67-74 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 60-69 మధ్య వస్తే గ్రేడ్‌ ‘బి2’
59-66 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 50-59 మధ్య వస్తే గ్రేడ్‌ ‘సీ1’
51-58 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 40-49 మధ్య వస్తే గ్రేడ్‌ ‘సీ2’
43-50 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 30-39 మధ్య వస్తే గ్రేడ్‌ ‘డి1’
35-42 మధ్య.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో 20-29 మధ్య వస్తే గ్రేడ్‌ ‘డి2’
34-…… సెకండ్‌ లాంగ్వేజ్‌లో 19-…. వస్తే గ్రేడ్‌ ‘ఈ’.