పద్మభూషణ్‌ వాపస్‌ చేసిన డాక్టర్‌ భార్గవ

1

– సంఘ్‌పరివార్‌ అరాచకాలే కారణం

– రాష్ట్రపతికి లేఖలో స్పష్టీకరణ

హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): దేశంలో పెరుగుతున్న మత అసహానికి నిరసనగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ ప్రభుత్వం తనకు ప్రధానం చేసిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేశారు. అవార్డుతో పాటు, ప్రశంసా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇవ్వడానికి కారణాలను వివరిస్తూ ప్రణబ్‌కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో శాస్త్రీయ ధృక్పదాన్ని ప్రోత్సహించడానికి బదులు మూఢనమ్మకాలను పెంపొందిస్తోందని భార్గవ విమర్శించారు.

రాష్ట్రపతికి లేఖలో వివరణ…..

దేశంలో పెరుగున్న మత అసహానికి నిరసనగా అవార్డులు తిరిగి ఇస్తున్నవారి జాబితాలో ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ కూడా చేశారు. ఈయన నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలజీ…. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌. జీవశాస్త్రరంగంలో ఆయన చేసిన పరిశోధలకు గుర్తింపుగా కేంద్రం 1986లో పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ చేతులు విూదుగా అవార్డు అందుకున్నారు. అటువంటి శాస్త్రవేత్త పీఎం భార్గవ ఇప్పుడు తన అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. పద్మభూషణ్‌ అవార్డులతోపాటు, ప్రశంసా పత్రాన్ని ఈనెల 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇచ్చేయడానికి కారణాలు వివరిస్తూ రాష్ట్రపతికి ఓ లేఖ కూడా రాశారు.

సంఘ్‌ పరివార్‌ శక్తులు చెలరేగిపోతున్నాయి …..

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడిన తర్వాత దేశంలో మత అసహనం పెరిగిపోయిందన్న విషయాన్ని డాక్టర్‌ భార్గవ… రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంఘ్‌ పరివార్‌ శక్తులు చెలరేగిపోతున్నాయని ఘాటుగా విమర్శించారు. కేంద్రంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బజారుకీడ్చిందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏమంత బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ పాలకులు తమ దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చిన తరహాలోనే బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు కూడా మన దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని డార్టక్‌ భార్గవ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

విభజనవాద అజెండా అమలు చేస్తున్న సంఘ్‌ పరివార్‌ ……

బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్‌ ఎస్‌ ఎస్‌ నాయకులు తమ సొంత భావజాలంతో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నది డాక్టర్‌ భార్గవ వాదన. సంఘ్‌ పరివార్‌ తమ విభజనవాద అజెండా అమలు చేయించుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇది ఆశాస్త్రీయం, అసమంజసమన్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించాల్సిన పాలకులు, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి అన్నది స్త్రీ, పరుషుల మధ్య ఒక ఒడంబడికని, మహిళ ఎక్కడా పనిచేయకుండా గృహిణిగానే ఉండాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలను డాక్టర్‌ భార్గవ గుర్తు చేశారు.

బీజేపీ ముందస్తు ప్రణాళికతోనే దాద్రీ ఘటన……

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రీ ఘటనను కూడా డాక్టర్‌ భార్గవ ప్రస్తావించారు. గోమాంసం తిన్నాడన్న వదంతులో మహ్మద్‌ ఇక్లాక్‌ అనే వ్యక్తికి ఓ ముఠా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది బీజేపీ శక్తులు ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ ఘటన అన్నది ఆయన ఆరోపణ. గోమాంసం తినొద్దని ఏ శాస్త్రం కూడా చెప్పలేదన్నారు. చాలా వైకల్యాల నివారణకు గోమాంసం పనిచేస్తుందని చక్ర సంహితలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. జలుబు, దగ్గు, జర్వం వంటి వ్యాధుల నివారణంతో పాటు… ఆకలి రగిల్చేందుకు దోహదం చేస్తుందని చక్ర సంహితలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. శారీరక శ్రమ చేసేవారు ఆవు మాంసం కోరుకుంటారని చెప్పారు.

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం….

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని డాక్టర్‌ భార్గవ.. రాష్ట్రపతి ప్రణబ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ పాలనతో తాము ద్వితీయ శ్రేణి పౌరులమన్న భావం ప్రబలిందని, దేశానికి ఇది మంచిదికాది ఆయన సూచించారు.