పద్మశాలి సంక్షేమ ట్రస్టుకు “అధ్యక్షుడు” లేడు.
కోశాధికారే కొనసాగింపు.
చైర్మన్ ఎన్నిక చేయకపోవడంపై సభ్యుల ఆగ్రహం.
ఆస్తుల కొనుగోలు పై విమర్శలు.
విమర్శల పాలవుతున్న గౌరవ వేతనం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1. (జనంసాక్షి). సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు జాతీయ స్థాయిలో పలువురిని ఆలోచింపజేసిన కాలం. ఓదార్పు మాటలే తప్ప ఆదుకునే పరిస్థితి
లేకపోవడంతొ అప్పట్లో పెద్ద విషాదమని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్న కాలంలో ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సిరిసిల్ల నేత కార్మికులకు చేతనైన సహాయం అందించాలని సంకల్పించారు. ఆయన సంకల్పం నుంచి పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ పురుడు పోసుకున్నది. 50 లక్షలు సేకరించి కేసీఆర్ ఈ ట్రస్ట్ కు అందజేశారు. అప్పటినుంచి నిరుపేదలైన నేత కార్మికులకు ఆర్థిక భరోసానిస్తూ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి.
మొదట్లో ట్రస్ట్ చైర్మన్ గా వంగరీ నరసయ్య బాధ్యతలు నిర్వహించారు. ట్రస్ట్ నుండి ఎలాంటి గౌరవ వేతనాలు తీసుకోకుండా ఆయన సేవలను అందించారు. ఎంతో ప్రతిష్టను సంపాదించుకున్న ట్రస్ట్ ఇటీవల మసకబారుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షులు వంగరి నర్సయ్య వయో భారంతో కన్నుమూశారు. ట్రస్టులోని మరికొందరు సభ్యులు కన్నుమూశారు. అప్పటినుండి ట్రస్ట్ కోశాధికారి గడ్డం విట్టల్ అనధికార అధ్యక్షుని హోదాలో కొనసాగుతున్నారు. ట్రస్ట్ సేవలు కొనసాగుతున్న పలు విమర్శలు మాత్రం తప్పడం లేదు. పద్మశాలి కళ్యాణ మండపం భవనం లో ట్రస్టు నిర్వహణ జరుగుతుంది. పద్మశాలి కళ్యాణ మండపం కూడా విరాళాలు సేకరించి నిర్మించింది. సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళు పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ లోను సభ్యులుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా ట్రస్ట్ సేవలకు సహకారం అందించవలసిన పరిస్థితుల్లో అద్దె లు ఎలా వసూలు చేస్తారంటూ పలువురు సభ్యులు బహిరంగంగానే మండిపడుతున్నారు.
ఇటీవల 40 లక్షలతో భవనం కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టిన సొమ్ము తిరిగి నిరుపేద నేతన్నలకు చేయుత ఇవ్వడం కోసం ఖర్చు చేయాల్సి ఉండగా భవనాలు ఎలా కొనుగోలు చేస్తారంటూ ట్రస్ట్ సభ్యులు గోనెల్లప్ప అసహనం వ్యక్తం చేశారు. సొంతంగా కొనుగోలు చేసిన భవనాన్ని అద్దెలకు తెలుపుతూ అద్దె భవనంలో ట్రస్టును కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుదీర్ఘకాలం సేవలందించిన వంగారి నరసయ్య ఎప్పుడూ కూడా గౌరవ వేతనం తీసుకోలేదని ఇప్పుడు కోశాధికారి అనధికార అధ్యక్షులుగా కొనసాగుతున్న గడ్డం విట్టల్ కు గౌరవ వేదం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ట్రస్ట్ సభ్యులు కుసుమ విష్ణు ప్రసాద్ ప్రశ్నించారు.
సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్టు లో ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తక్షణమే పూర్తిస్థాయి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ ఎన్నిక చేయాలని కుసుమ విష్ణు ప్రసాద్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అనధికార అధ్యక్షులుగా అధ్యక్షులుగా కొనసాగుతున్న గడ్డం విట్టల్ ఈ విషయంపై స్పందిస్తూ ట్రస్టును లాభాల బాటలో నడిపిస్తున్నామని గతంలో కంటే నిరుపేద నేత కార్మిక కుటుంబాలకు ఇచ్చే రుణ పరిమితిని పెంచామంటూ చెప్పుకొస్తున్నారు. భవనం కొనుగోలు వ్యవహారం ఇతర ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ రావడంపై సభ్యులు అసహన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నూతన చైర్మన్ ఎన్నుకుంటే జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయని ట్రస్ట్ సభ్యులు విష్ణు ప్రసాద్, గోనె ఎల్లప్పలు తెలిపారు. సేవ భావంతో నిరుపేద నీత కుటుంబాలకు చేతితో అందించాల్సిన ట్రస్టు ప్రతిష్ట మసకబారకుండా చూడాల్సిన అవసరం ఉందని నిరుపేద నేత కుటుంబాలు కోరుతున్నాయి.