పనిచేయని మోదీ మానియా

3

– బీహార్‌లో భాజాపా భంగపాటు

పాట్నా నవంబర్‌ 8 (జనంసాక్షి):

భాజాపాను అంతా తామై నడిపిస్తామని ప్రతిజ్ఞ పూనిన నరేంద్రమోదీ మానియా పని చేయలేదు. బీహర్‌లో కమలం వాడి పోయింది. అ పార్టీకి భంగపాటు తప్ప లేదు.

మోడీ వెలుగులు మసకబారాయి.. ఏడాదిన్నర కాలంలోనే ఆయన ప్రభ తగ్గిపోయింది. మోడీ ప్రధాని పీఠం అధిరోహించాక.. పార్టీకి వన్‌సైడ్‌ విజయాలను అందించడంలో ఓ రెండు సందర్భాల్లో తప్ప దాదాపు విఫలమయ్యారు. ఈఏడాది జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోదీ జాదూ ఏమాత్రం పనిచేయక పోగా.. పార్టీకి చావుదెబ్బ తగిలింది. దీంతో మోదీపై ఇంటా బయటా ఒత్తిళ్లు అధికమవుతున్నాయి.

మోడీకి వన్‌సైడ్‌ ఫలితం ఇవ్వని రాష్ట్రాల ఓటర్లు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమి.. ప్రధాని మోదీకి పెద్ద షాకేనని చెప్పాలి. గత ఏడాది మే 26న ప్రధాని గద్దెనెక్కిన మోదీ… ఇప్పటివరకూ.. ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపారు. 2014లో సాధించిన ఓ రెండు విజయాలే తప్ప.. ఇప్పటి వరకూ ఆయనకు ఏ ఒక్క రాష్ట్రమూ వన్‌సైడ్‌ ఫలితాలివ్వలేదు. పైగా యూపీ, పశ్చిమ బంగ్లల్లో జరిగిన ఉప ఎన్నికలూ ఆయనకు పరాభవాన్నే మిగిల్చాయి.

ప్రతిపక్ష ¬దాకూ దూరమైన బీజేపీ

మోడీ ప్రధాని అయిన సంవత్సరంలో.. హర్యానా, జార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. కమల దళానికి ఆశావహ ఫలితాలు వచ్చాయి. హర్యానా, జార్ఖండ్‌లలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాగా.. జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్రలలో మరొకరితో కలిస్తే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ సహా.. పార్టీ ప్రముఖులంతా మట్టికరిచారు. కనీసం ప్రతిపక్ష ¬దాను కూడా బీజేపీ దక్కించుకోలేక పోవడం గమనార్హం.

పాతికేళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బీజేపీ-శివసేన

అటు మహారాష్ట్ర ఎన్నికల్లో పాతికేళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బీజేపీ, శివసేనలు.. మహారాష్ట్ర ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల అనంతరం రెండు పార్టీలూ కలిస్తే కానీ అక్కడ అధికారాన్ని దక్కించుకోలేక పోయాయి. ఇక్కడ అధికారాన్ని దక్కించుకున్నామన్న ఆనందం కన్నా.. చిరకాల మిత్రుడు.. ప్రబల శత్రువుగా మారడం మోదీని తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తోంది. ప్రస్తుత బీహార్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని శివసేన డిమాండ్‌ చేయడం విశేషం.

విదేశీ పర్యటనలపైనే మోదీ శ్రద్ధ

వరుస పరాజయాలు మోదీకి మింగుడుపడకుండా ఉన్నాయి. విదేశీ పర్యటనలపై చూపుతున్న శ్రద్ధ.. పాలనపై చూపడం లేదన్న ఆరోపణలు మోదీకి వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. దేశంలో మత అసహనం పెరుగుతోందంటూ.. మేధావులు గగ్గోలు పెడుతున్నా.. మోదీ నామమాత్రంగానూ స్పందించక పోవడం బీహార్‌ ఓటర్లలో ఆందోళనకు కారణమై మోదీకి గుణపాఠం నేర్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బీహార్‌ ఓటర్లు.. మోదీ జాదూ ఇకపై చెల్లదని.. ఆయన అభివృద్ధిపై దృష్టి సారించకుంటే.. త్వరలో జరిగే మరిన్ని రాష్ట్రాల్లోనూ పరాభవం మూటగట్టుకోక తప్పదని విశ్లేషకులు సూచిస్తున్నారు.