పరిశ్రమల స్థాపనకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్
నెల్లూరు, జూలై 28 : జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందిన మీదటే వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే పారిశ్రామికవేత్తలు ఆయా ప్రాంతాల్లో కావాల్సిన భూమి, పవర్, మంచినీటి వసతి, తదితర అంశాలపై సమగ్రమైన నివేదికను తయారు చేసుకుని దాంతో పాటు అనుమతి కోరుతూ జిల్లా పరిశ్రమల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే ఆయా పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే స్థలాలను వాడుకుంటున్నట్టు సమాచారం అందిందని, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమతి పొందిన పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పరిశ్రమలకోసం అనుమతి పొందిన పారిశ్రామిక వేత్తలు నిర్ణీత వ్యవధిలో పరిశ్రమలను స్థాపించనట్టయితే వారి ఒప్పందాన్ని రద్దు చేస్తామని కలెక్టర్ తెలిపారు.