పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన రైల్వే

వాటర్‌ బాటిల్‌ క్రషర్‌లో వేస్తే రూ.5 నగదు ప్రోత్సాహకం

న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా రీసైక్లింగ్‌కు సహకరించే ప్రయాణికులకు నగదుప్రోత్సహకాలు ఇవ్వనుంది. మొదటి ప్రయత్నంగా వడోదరలోని రైల్వే స్టేషన్‌లో ప్లాస్టిక్‌ బాటిల్‌ క్రషర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో పాటు బాటిళ్ల రీసైక్లింగ్‌కు సహకరించే వారికి కొంత రివార్డు ఇచ్చేలా ఓ పథకాన్ని ప్రారంభించింది. దీన్లో భాగంగా… ప్రయాణికుడు క్రషర్‌లో ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ను వేస్తే వెంటనే వారి పేటీఎం వ్యాలెట్‌లోకి రూ.5 జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే పక్రియలో భాగంగా ఈ పథకాన్ని తీసుకుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్‌ను క్రషర్‌లో వేసిన తరవాత ప్రయాణికులు తమ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారి పేటీఎం మొబైల్‌ ఖాతాలో డబ్బు జమవుతుంది. ఇప్పటికే రైల్వే… ప్రయాణికులకు భోజనాల్ని ప్లాస్టిక్‌ ప్లేట్లలో కాకుండా బగాసేతో తయారు చేసిన పర్యావరణహిత ప్లేట్లలో అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి న్యూదిల్లీ నుంచి నడిచే రాజధాని, శతాబ్ది రైళ్లలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఎ/-లాస్టిక్‌ వినియోగం తగ్గించే దిశలో భవిష్యత్తులో ఇతర రైళ్లలోనూ ఈ నిర్ణయాలు అమలయ్యే అవకాశం ఉంది.