పర్వావరణ పరిరక్షణకు ఆక్వారైతులు ప్రాముఖ్యతనివ్వాలి
– విద్యుత్‌పై మరింత రాయితీ ప్రకటించిన ముఖ్యమంత్రి
– సీఎంతో సమావేశమైన ఆక్వారైతులు
– పలు సమస్యలను సీఎం ఎదుట వెల్లబుచ్చుకున్న రైతులు
– దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చిన సీఎం
అమరావతి, మే26(జనం సాక్షి) : పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం ఆక్వారైతులు, ఎగుమతిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం మంచిదికాదన్నారు. పర్యావరణహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని అధిక లాభాలు పొందాలని ఆకాంక్షించారు. రిజిస్టేష్రన్ చేయకుండా ఆక్వా సాగు చేయడం సరికాదన్నారు. కోస్తాంధ్రలో ఆక్వా రంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, అందుకే విద్యుత్తు ఛార్జీలు తగ్గించామని చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించాలని సూచించారు. అప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆక్వా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వా సాగుకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు, విద్యుత్ ధరలపై రాయితీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆక్వాను ప్రాథమికరంగంగా గుర్తించి ప్రోత్సాహాకాలు ఇస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత నిర్ధరణకు అత్యాధునిక లేబరేటరీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. విద్యుత్ ధరపై మరింత రాయతీ కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సీఎం విద్యుత్‌పై మరింత రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిపాటు యూనిట్‌కు రూ. 2 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్లకుపైగా భారం పడుతుందని, అయినా రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
————————-