పల్లెబాటకు అపూర్వ స్పందన
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (: తెలంగాణ సాధించే దిశగా ప్రజలను మరింత చైతన్య పరిచే విధంగా టిఆర్‌ఎస్ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఐదవ రోజైన ఆదివారం నాడు కూడా కొనసాగింది. తెలంగాణను వ్యతిరేకించే విషయాల్లో టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అవుతున్నాయని ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ వాదాన్ని వినిపించే విధంగా అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను బలపరచాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక సమస్యలతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమాల ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఇందుకు కోసం ప్రజలు, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉండాలని నాయకులు సూచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పల్లెబాట కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఓదేలు, సమయ్యలతో పాటు ఆ పార్టీల అధ్యక్షులు సతీష్‌కుమార్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.