పశువులకు తొట్టెల ద్వారా నీటి సరఫరా
మెదక్,ఏప్రిల్15: జిల్లాలో తీవ్రనీటి ఎద్దడి కారణంగా పశువులు నీటి కోసం అల్లాడుఉతన్నాయి. దీంతో తాగునీటికి తొట్టెలను ఏర్పాటు చేశారు. పశువుల తొట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి దాహర్తి తీర్చడానికి ఆదేశాలిచ్చారు. వర్షాకాలం వచ్చే వరకూ జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా సకల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. జిల్లాలో 493 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని 681 ఆవాసాలకు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లిపారు. అవసరమైతే మరిన్ని ఆవాసాలకు ట్యాంకర్లతో అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భూగర్భజలాలు అడుగంటినందున జిల్లాలో ఉన్న 14 వేల చేతిపంపులకు 7 వేలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. 1,900 నీటిపథకాల్లో 400 మాత్రమే పనిచేస్తుండగా సీపీడబ్ల్యూఎస్ పథకాలు పనిచేయడం లేదన్నారు. నల్లవాగు నుంచి సరఫరా అవుతున్న నీటిని నారాయణ్‌ఖేడ్ పట్టణంలోని ట్యాంకులకు చేర్చి ఇంటింటికీ సరఫరా చేస్తామన్నారు. ఆలోపు పట్టణంలోని పైపులైను లీకేజీలను పంచాయతీ ద్వారా లేకుంటే తమశాఖ ద్వారా అరికడతామన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించేలా ఇంటింటికి ఇంకుడుగుంతలను తవ్వించుకునేలా ప్రోత్సహిస్తామని అన్నారు. పొదుపు చేసి భూగర్భజల మట్టం పెంచేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని అన్నారు. గ్రామాల్లో నీటి పైపుల లీకులు, పొదుపునకు అవలంబించాల్సిన విధానాలు, జల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు.