పశువుల తరలింపును అరికట్టాలి

శ్రీకాకుళం, జూన్‌ 25 :

జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి పశుసంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు టి.దుర్గారావు ఆరోపించారు. దీనిని తక్షణమే నిరోధించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని నవగాం, చింతాడ, కంచిలి, నారాయణ వలస నుంచి రోజు సుమారు మూడు కంటేనర్ల ద్వారా పశువులను తరలిస్తున్నారని అన్నారు. ఈ విషయం రెవెన్యూ, అధికార యంత్రంగానికి తెలిసినా చోద్యం చూస్తుందే తప్ప, చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. కంచిలి, బోరివంక, జగతి గ్రామస్థులు గో-సంరక్షణ కమిటీలుగా ఏర్పడ్డారన్నారు. కాగా రైతంగానికి సకాలంలో విత్తనాలు అందించడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదర్శ రైతులను చూలకన చేసి మాట్లాడి అవమానపర్చడాన్ని పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటసన్యాసిరావు, ఉపాధ్యాక్షులు ధ్రోణచార్యులు తదితరులు పాల్గొన్నారు.