‘పశ్చిమ’లో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
13 ప్రైవేటు, 45 స్కూల్ బస్సుల సీజ్
ఏలూరు, జూన్ 24 : పశ్చిమగోదావరి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఈ దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఏలూరు ఈఎంఎస్ ప్రతినిధికి అందించిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 45 ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు వాటిని సీజ్ చేశారు. పరిమితికి మించి విద్యార్థులను చేరవేయడం డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడం కొన్నింటికి పర్మిట్లు లేకపోవడం, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన జాగ్రత్తలు పాటించకపోవడం రెన్యూవల్స్ చేయకపోవడం వంటి లోపాలను ఈ దాడుల్లో గుర్తించారు. వర్షాకాలంలో వాహనాలకు వైబర్లు అమర్చడం తప్పనిసరి. ఇలాంటి జాగ్రత్తలు ఎవరూ పాటించడంలేదు. దీని వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి లోపాలను కూడా దాడుల్లోగుర్తించారు. మరోవైపు 13 ప్రైవేటు ఆపరేటర్ల బస్సులను సీజ్ చేశారు. కావేరి, కేశినేని, సాయి టూర్ ట్రావెల్స్ సహ పలు ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ జారీ చేసిన పర్మిట్ నిబంధనలకు విరుద్ధంగా స్టేజీ క్యారింగ్ కు పాల్పడుతున్నందునే ఈ బస్సులను సీజ్ చేసినట్టు డీటీసీ చెప్పారు. ఈ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుందని, నిబంధనలు పాటించే వరకు దాడులు ఆపబోమని ఆయన చెప్పారు.