‘పశ్చిమ’లో పట్టపగలే చోరీలు

దేవుడి నగలనూ వదలని దొంగలు
ప్రేక్షక పాత్రలో పోలీసులు
ఏలూరు, జూలై 30 : ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గృహ సముదాయానికేకాదు, వాణిజ్య సంస్థలు, చివరకు ఆలయాలకు భద్రత కరువైంది. దొంగలు పేట్రేగిపోతున్నారు. మహిళలకు రక్షణ లేకుండాపోయింది. పట్టపగలే దోపిడీ జరుగుతోంది. ఏ మూల నుంచి ఎవరు విరుచుకుపడి దోపిడీ చేస్తారోనన్న భయోత్పాతం నెలకొంది. కేవలం అర్ధరాత్రి వేళల్లో జరిగే చోరీలు, దోపిడీలు పోలీసుల అసమర్థత వల్ల పట్టపగలే చోటుచేసుకుంటున్నాయి. భక్తుల సెంటిమెంట్‌కు ఆలంబనగా నిలుస్తున్న దేవాలయాలకు రక్షణ కరువైంది. జిల్లాల్లోని పలు దేవాలయాల్లో దేవుడి నగలు అపహరణకు గురవుతున్నాయి. భక్తుల సెంటిమెంట్‌ దెబ్బతింటోంది. ప్రభుత్వం తీరుపై భక్తుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దేవాలయాల్లో జరుగుతున్న చోరీలను, దానికి కారకులను గుర్తించే స్థితిలో పోలీసులు లేకపోవడం భక్తుల్లో ఆవేదనను కలిగిస్తోంది. సరిగ్గా గత శనివారం ఏలూరు నగరంలోని దక్షిణ వీధిలో ఉన్న జాల పహరేశ్వర స్వామి ఆలయంలో వెయ్యి సంవత్సరాల క్రితం స్థాపించిన రాజనంది విగ్రహం కాలును విరగ్గొట్టి మరీ దుండగులు అతి విలువైన వెండి కంకణాన్ని ఎత్తుకుపోయారు. ఈ ఆలయంలో జరిగిన ఈ దోపిడీ నగరంలోని భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ముస్లింలు, హిందువులు ఆ ఆలయంలో పూజలుచేయడం, వారి మధ్య శాంతి సామరస్యాలకు ఆలంబనంగా చెబుతుంటారు. వెయ్యి ఏళ్ల క్రితం ముస్లిం పెద్దలు ఈ ఆలయంలో భారీ సైజులో ఉన్న రాతి నందికి తమ గౌరవార్థం వెండి కంకణాన్ని తొడిగారు. ఇరు వర్గాలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆలయంలో పూజలు చేయడం, రాజనందికి పూజ చేయడం జరుగుతోంది. ఎప్పుడైతే నంది కాలు విరగొట్టి ఆగంతకులు కంకణాన్ని అపహరించారో నగరంలోని ముస్లింలు, హిందువులు సంయుక్తంగా నిరసనలు వెల్లగక్కారు. పోలీసులపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పురావస్తు శాఖ అధికారులు రంగంలోకి దిగి రాజనందికి మరమ్మతులు చేయడానికి శ్రమించే పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనపై అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జిల్లాలో దేవాలయాలకు కరువైన భద్రతపై జిల్లా అర్చక సమైక్య ఆందోళనకు పిలుపునిచ్చింది. దేవుడికే కాదు, మహిళలు దొంగల భయంతో హడలెత్తిపోతున్నారు. ఏలూరు నగరంలో మహిళల మెడల్లోంచి బంగారం ఆభరణాలను తెంచుకుపోతున్నారు. మహిళల ఒంటిపై చెయ్యి వేస్తే లక్షాధికారి కావచ్చన్న దుర్బిద్ధితో దొంగలు రెచ్చిపోతున్నారు. నేరాలను అరికట్టాల్సిన పోలీసులు ‘అంతా బాగానే ఉంది. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం’ అంటూ పరిపాటిగా చేస్తున్న ప్రకటనలు ప్రజల కంటితుడుపు చర్యే అన్న భావనలను రేకెత్తిస్తున్నారు.

తాజావార్తలు