పాకిస్థాన్ లక్ష్యం 301

అడిలైడ్ (జ‌నంసాక్షి) : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విఫలమైనా.. ప్రపంచ కప్లో తమ తొలి మ్యాచ్లోనే అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మెరుపులు మెరిపించారు. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 301 పరుగుల  భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (107) సెంచరీకి తోడు సురేష్ రైనా (74), ధవన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 300 మార్క్ చేరుకోగలిగింది. పాకిస్థాన్ బౌలర్ సొహైల్ ఖాన్ 5 వికెట్లు తీశాడు.

భారత ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ ధవన్ రాణించాడు. ధవన్కు కోహ్లీ అండగా నిలిచి జట్టును ఆదుకున్నారు.  వీరిద్దరూ రెండో వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో ధవన్ రనౌటయ్యాడు. అయితే సురేష్ రైనా క్రీజులో నిలిచి ధవన్ లేని లోటును తీర్చాడు. రైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. రైనా, కోహ్లీ మూడో వికెట్కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ, రైనా హాఫ్ సెంచరీ చేశారు.

45 ఓవర్లలో టీమిండియా స్కోరు 273/2. అప్పటికి విరాట్ సెంచరీ, రైనా మెరుపు హాఫ్ సెంచరీ చేసి మాంచి దూకుడు మీదున్నారు. దీంతో భారత్ కనీసం 320 పరుగులు చేస్తుందనిపించింది. అయితే సొహైల్ ఖాన్ వరుస ఓవర్లో కోహ్లీ, రైనాను అవుట్ చేయడంతో స్కోరుబోర్డు మందగించింది. కోహ్లీ.. అక్మల్కు, రైనా హారిస్ సొహైల్కు క్యాచిచ్చారు. ఆ తర్వాత జడేజా 5 బంతులాడి 3 పరుగులకే వెనుతిరగగా, రహానే పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ధోనీ (18) ఫర్వాలేదనిపించినా చివరి ఓవర్లో అవుటయ్యాడు. దీంతో భారత్ చివర్లో దూకుడుగా ఆడలేకపోయింది. కష్టమ్మీద 300 మార్క్ చేరుకుంది.