పాక్‌లో హిందువులను వేధిస్తే సహించం

Untitled-4copy
– పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

కరాచీ,నవంబర్‌ 12 (జనంసాక్షి) :

పాకిస్థాన్‌లోని హిందువులకు అండగా ఉంటానని, వారిని అణచివేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. తాను అన్ని వర్గాల వారికీ ప్రధానమంత్రినని చెప్పారు. ‘ఒక హిందువును ఒక ముస్లిం వ్యక్తి వేధిస్తే.. ఆ ముస్లింకు వ్యతిరేకంగా నేను చర్య తీసుకుంటాను. పీడనకు వ్యతిరేకంగా నేను హిందువులకు అండగా ఉంటాను’ అని షరీఫ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కులను కాలరాస్తుండటంపై అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఓ ¬టల్‌లో జరిగిన దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్న షరీఫ్‌ మాట్లాడుతూ ‘బలహీన, అట్టడుగు వర్గాల వారికి అండగా నిలబడమని నా మతం నాకు బోధించింది. నిజానికి ఏ మతమైనా అణచివేతకు గురవుతున్న బలహీనవర్గాల వారికి అండగా నిలువాలనే చెప్తుంది’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో ఉండే వారంతా ఒకే జాతీయులని, అందరూ ఐక్యంగా ఉంటూ.. ఒకరినొకరు సహకరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ కమ్యూనిటీ నేతలతో భేటీ అయిన ఆయన.. మైనారిటీ హక్కులకు రక్షణ కల్పిస్తామని హావిూ ఇచ్చారు.