పాఠశాలల ప్రారంభంపై చర్యలు తీసుకోవాలి


పారిశుద్య బాధ్యత స్థానిక సంస్థలదే
కరోనా నిబంధనల మేరకు శానిటైజ్‌ చేయాలి
అధికారులతో మంత్రి సబిత సవిూక్ష
హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం మంత్రి సబిత ఇంద్రారెడ్డి సవిూక్ష నిర్వహించారు. దాదాపు 17 నెలల తర్వాత స్కూల్స్‌ పునఃప్రారంభమవుతున్నాయన్నారు. పాఠశాలలను శానిటైజేషన్‌ చేయించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్‌ స్కూల్స్‌లో కూడా వసతులు మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. స్కూల్స్‌లో శానిటైజేషన్‌ పనులపై సమాచారం అందించాలని ఆదేశించారు. ఎవరికైనా కొవిడ్‌ సోకితే వెంటనే వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. కొవిడ్‌ నిబంధనలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలని సూచించారు. స్కూల్‌ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో భౌతికంగానే తరగతులు జరుగుతాయని మంత్రి సబిత స్పష్టం చేశారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ లేదని స్పప్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేని చెప్పారు. పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్‌, కార్పొరేటర్‌, మేయర్‌లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతిగృహాల్లో ఐసోలేషన్‌ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఉన్నారు.