పాఠశాలల రేషనలైజేషన్ తగదు
విశాఖపట్టణం,జూన్4(జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు సంఖ్య 29 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూత పడుతున్నాయన్నారు.ప్రభుత్వం విద్యా ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు చర్యలు చేపట్టకుండా పిల్లలు తక్కువ సంఖ్యలో ఉన్నారనే సాకుతో పాఠశాలలను మూసివేయడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రాథమిక పాఠశాలల్లో 1.20 ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పాటిస్తూ ప్రాథమికోన్నత సెక్షన్లలో గరిష్టంగా 35 మంది, ఉన్నత పాఠశాలల్లో గరిష్టంగా 40 మంది విద్యార్థులు ఉండే విధంగా నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రణ చేయడం ఇష్టం లేని ప్రభుత్వం వారికి మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు. హేతుబద్ధీకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3778 ప్రాథమిక పాఠశాలలు, 2384 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు రద్దు వల్ల సుమారు 96 వేలు మంది పిల్లలు విద్యాహక్కు ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. . జిఒ 29లోని అసంబద్ద నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.