పాతబస్తీలో ఘర్షణ..ఒకరి మృతి
హైదరాబాద్: వివాహ నిశ్చితార్థం వేడుకల్లో చికెన్ కోసం జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హరేహత్ మంజిల్ అనే ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి నిశ్చితార్థం వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు హాజరైన అన్వర్, అన్వర్ సోహైల్ ఇద్దరూ విందులో ఆహారపదార్థాలు వడ్డిస్తున్నారు. ఈ విందుకు హజరైన అశ్వాక్ అనే వ్యక్తి తనకు చికెన్ వడ్డించలేదని అన్వర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘర్షణ పెద్దది కావడంతో అశ్వాక్ తన మిత్రులకు ఫోన్ చేసి విందు జరిగే ప్రాంతానికి రప్పించాడు. అశ్వాక్ మిత్రుల్లో ఒకరు అన్వర్ కడుపులో కత్తితో పొడిచాడు. అడ్డగించబోయిన అన్వర్ సోహైల్ వీపుపై కత్తితో పొడిచి వారంతా పారిపోయారు. గాయపడిన వీరిద్దరిని బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు. దీనిపై హుస్సేనీ అలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ అంజయ్య తెలిపారు.