పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
జాతీయ జెండాతో ముస్లింల ఊరేగింపు
దేశభక్తి, దైవభక్తిని చాటిన హైదరాబాదీలు
హైదరాబాద్, జనవరి 25 (జనంసాక్షి) :
మహ్మద్ ప్రవక్త జన్మదినం (మిలాద్-ఉన్-నబీ) సందర్భంగా పాత బస్తీలో ముస్లింలు దేశభక్తి.. దైవభక్తిని చాటి చెప్పారు. జాతీయ జెండా, ముస్లిం జెండాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8.20 గంటలకు మక్కామసీదు నుంచి ర్యాలీ బయల్దేరింది. ర్యాలీలో పాల్గొన్న వారిని మతపెద్దలు ఆశీర్వదించారు. ర్యాలీ మదీనా సెంటరు మీదుగా దారుల్‌షిఫాకు.. అక్కడి నుంచి మొఘల్‌పురాకు చేరుకుంది. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త బోధనలు వివరించారు. ర్యాలీ సందర్భంగా పాతబస్తీ మొత్తంఆకుపచ్చ జెండాలతో శోభాయమానంగా మారింది. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపు కుంటూ ముస్లింలు ముందుకు సాగారు. దారుసలేంలో యువకులకు, విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. పేదలకు అన్నదానం చేశారు. మలక్‌పేట, చంపాపేట, డబీర్‌పురా, మొఘల్‌పురా, పత్తర్‌ఘట్టి, లాడ్‌బజార్, శాలిబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో ముస్లింలు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున స్వీట్లు పంచిపెట్టారు.
భారీ భద్రత.. మిలాద్-ఉల్-నబి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు. చార్మినార్, మక్కా మసీదు వద్ద బలగాలు మొహరించాయి. వాటర్ కేనాన్లు సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు దళాలను మొహరించారు. ఎలాంటి సమస్య తలెత్తినా చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.