పారిశుద్ధ్య లోపంతోనే అంటువ్యాధులు
మహబూబ్‌నగర్,మే28(జనం సాక్షి): రానున్నది వర్షాకలం కనుక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యదానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిని సూచించారు. అనేక వ్యాధులు పారిశుద్య లోపం కారణంగానే సంక్రమిస్తున్నాయని అన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువన్నారు. డయేరియా మరణాలను నివారించడం మనందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిని తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మే 28 నుంచి 9 జూన్ వరకు ఉదృత డయేరియా నివారణ పక్షోత్సవాన్ని నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశలు ఇల్లిలు తిరుగుతూ 5 సం.లోపు పిల్లలున్న ఇండ్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను అందిస్తారని, అలాగే జింక్ మాత్రలు కూడా ఇస్తారని తెలిపారు. గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాఠశాల విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకొనే విధానాన్ని నేర్పిస్తారని, అంగన్‌వాడీలలో పిల్లల పోషణ గురించి సూచనలు, సలహలు, పోషకాహారం తయారీ, తదితర ఆంశాలపై ఈ పక్షం రోజులలో అవగాహన కల్పిస్తారని వివరించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని డయేరియాను నివారించాలని, పరిసర పారిశుధ్యం గురించి వివరించాలని కోరారు.
—-