పారిస్ దాడుల కీలక సూత్రధారి అబెదుల్ హమీద్ అబౌద్ హతం
హైదరాబాద్ నవంబర్ 19 (జనంసాక్షి):
పారిస్ దాడులకు కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇస్టామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది అబ్దెల్‌హమీద్ అబౌద్ హతమైనట్లు ఫ్రాన్స్ అధికారికంగా ప్రకటించింది. ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అబౌద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ముందుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాము జరిపిన కాల్పుల్లోనే అతడు మృతిచెందినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. గత శనివారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. నగరంలోని పలుచోట్ల దాడులకు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 129 మంది మృత్యువాత పడ్డారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అయితే దాడులకు సూత్రధారి అయిన ఉగ్రవాది తలదాచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు బుధవారం పారిస్ శివారులోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. అపార్ట్‌మెంట్‌లో కాల్పులు మొదలుకావడంతో పోలీసులు ఎదురుదాడికి దిగారు. కొన్ని గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతిచెందగా… మరో మహిళా తీవ్రవాది ఆత్మాహుతికి పాల్పడింది. పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్‌హమీద్ అబౌద్ పోలీసులకు చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడని దిల్లీలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిన్ రిచీర్ వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందన్నారు. హమీద్ అబౌద్ తమ కాల్పుల్లో మృతిచెందినట్లు ఫ్రాన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది.