పార్కు స్థలాల రక్షణకు ఆమోదం

పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 29 అభివృద్ధి అంశాలకు గ్రీన్ సిగ్నల్
రోడ్లు, డ్రైనేజీ, పరిశుభ్రతపై విస్తృత చర్చ
మేడిపల్లి – జనంసాక్షి
పార్కు స్థలాలను కొల్లగొట్టేస్తున్న అంశాలు పీర్జాదిగూడ కౌన్సిల్ సమావేశంలో విస్తృత చర్చకు దారితీసింది. దీంతో పార్కుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ నిర్ణయించింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇందులో 29 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలాలను సంరక్షణకు ఫెన్సింగ్, ప్రహరీ గోడ నిర్మాణం చేయడంతో పాటు వాటిలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం, ప్రధానంగా 6 పార్కులను మోడల్ పార్కులుగా అభివృద్ధి చేయడం కోసం తీర్మానం చేశారు. గుంతలు పడ్డ రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ లో ఉన్న రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం చేయడం, వీధి వ్యాపారులకోసం ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న స్ట్రీట్ వెండింగ్ జోన్ త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందించడం, దోమల నివారణకు నీటి నిల్వ ఉండే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు ప్రతి వార్డుకు ఒక  అవసరమైన కొత్త తైవాన్ ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయడం,నేరాల నివారణకు గతంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలను పూర్తి స్థాయిలో అనుసంధానం చేసి ఇంకా అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయడం, రెవిన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ప్రభుత్వం స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించడం, పర్వతాపూర్ సర్వే నంబర్ 1లో సీలింగ్ ల్యాండ్ ను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయవలసిందిగా తహసీల్దార్ ను కోరుతూ తీర్మాణం చేశారు. బుద్దానగర్ లో నర్సరీ సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం, బతుకమ్మ సంబరాల సందర్బంగా చీరల పంపిణీతో పాటు ఘనంగా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడం అదేవిధంగా అవసరమైన చోట వీధిదీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. 24 గంటల నీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు అవసరమున్నచోట కొత్త పైప్ లైన్ నిర్మాణం, జంక్షన్ల ఏర్పాటు చేయడం, నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి కాలనీలో జియో ట్యాగింగ్ చేసిన స్ట్రీట్ నెంబర్లు, సైన్ బోర్డలు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారని మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ డా. పి రామకృష్ణ రావు, కార్పొరేటర్లు కే సుభాష్ నాయక్, బి శారద , హరి శంకర్ రెడ్డి, బండారి మంజుల, కో  ఆప్షన్ సభ్యలు, మేనేజర్ జ్యోతి రెడ్డి, ఏఈ వినీల్ గౌడ్, ఎస్సై జానకి రెడ్డి, మున్సిపల్, రెవిన్యూ, జలమండలి అధికారులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.