పార్టీల అధ్యక్షులే అఖిలపక్షానికి రావాలి : కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్ అధినేత అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన నివాసంలో జరిగిన జేఏసీ నేతల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధ్యక్షులు హాజరై తెలంగాణకు అనుకూలమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌సీపీ నుంచి వైఎస్ విజయలక్ష్మిలు అఖిలపక్షానికి హాజరు కావాల్సిందేనని ఆయన అన్నారు.
తెలంగాణలో తిరగనివ్వం : కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలు ఇవ్వక పోతే ఏపార్టీ నేతలనైనా సరే తెలంగాణలో తిరగనివ్వమని కేసీఆర్ హెచ్చరించారు. అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. లేకుంటే ఏ పార్టీకి తెలంగాణలో పుట్టగతులుండవని హెచ్చరించారు.
మీడియా పక్షపాత బుద్ధి మానుకోవాలి
తెలంగాణ ప్రాంత వార్తలను సీమాంధ్ర మీడియా పట్టించుకోవడంలేదని కేసీఆర్ విమర్శించారు. తమ టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నా సీమాంధ్ర పత్రికలు, టెలివిజన్లు కనీసం ప్రాధాన్యత నివ్వడంలేదని, వార్తలను ప్రసారం చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీమాంధ్ర మీడియా తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. బుచ్చిబుచ్చి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే సీమాంధ్ర మీడియా తెలంగాణ వార్తలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు.