పార్టీ పరిణామాలపై అనుచరులతో కేజ్రీ చర్చ

వైద్యం కోసం బెంగుళూరు వెళ్లనున్న ఆప్‌ నేత
న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌లను తప్పక తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాల వల్ల తెలుస్తోంది. ఓ వైపు పార్టీని విజయతీరాలకు చేర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో జరుగుతన్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇకపోతే కేజ్రీవాల్‌ గొంతునొప్పి దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ఆయన చికిత్స తీసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ వారం రోజులు సెలవుపై వెళ్లాలని చూస్తున్నారు.  వచ్చేవారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకృతి వైద్య చికిత్స కోసం బెంగళూరు వెళ్లనున్నారు. గత కొంత కాలంగా ఆయన చక్కెర స్థాయుల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, దీర్ఘకాలిక దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పదిరోజుల పాటు ప్రకృతి చికిత్స కోసం మార్చి 5న కేజీవ్రాల్‌ బెంగళూరు బయల్దేరి వెళ్తారు. ఈ దశలో  పార్టీలో తాజా పరిణామాలపై ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయకూడదని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆప్‌ పార్టీ అధికారం చేపట్టి 20 రోజులు కాలేదు… ఇంతలోనే విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీ కన్వీనర్‌ పదవి నుంచి కేజీవ్రాల్‌ను తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చింది. ఇప్పుడు పార్టీలో నిర్ణయాత్మక ఘడియ వచ్చిందని కొందరు ఆప్‌ నేతలు చెబుతున్నారు. అయితే ఈ వివాదంపై బుధవారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేతలు ఒంటెద్దు పోకడలకు దిగారంటూ కొందరు విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీకి వెన్నెముకగా ఉన్న నేతలే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పార్టీ కన్వీనర్‌గా ఉన్న కేజీవ్రాల్‌ ఉమ్మడి నిర్ణయాలకు అవకాశం ఇవ్వడంలేదని భూషణ్‌ ఆరోపించారు. పార్టీ ఏక వ్యక్తి పాలనవైపు పయనిస్తుందని ఆయన ఫిబ్రవరి 26న లేఖ రాశారు. పార్టీ వసూలు చేసిన నిధులను మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టారని, చేసిన ఖర్చులను పెట్టడంలేదని ఆయన గుర్తు చేశారు. ఈ లేఖ బయటపడడమే పార్టీలో ముసలానికి కారణమని తెలియవచ్చింది. యోగేంద్రయాదవ్‌, మనిష్‌ సిసోడియాల మధ్య పోలింగ్‌కు ముందు నుంచే విబేధాలు ఉన్నాయి. సిసోడియాకు సన్నిహితులుగా ఉన్నవారికి టికెట్లు ఇస్తున్నారంటూ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నుంచి యాదవ్‌ వాకౌట్‌ చేశారు. సమాధానపరిచేందుకు కుమార్‌ విశ్వాస్‌ వెళ్లినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఇంతలోనే ప్రశాంత్‌భూషణ్‌, యోగేంద్రయాదవ్‌ను రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించాలని సిసోడియా ఒక తీర్మానం ప్రవేశపెట్టడం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. గత జూన్‌లో కూడా వీరి మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు నేతలు ముఠా తత్వాన్ని పోత్సహిస్తున్నారని సిసోడియా ఆరోపించారు. వారిని పీఏసీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల పార్టీకి సంబంధించిన కీలక సమాచారాలను యోగేంద్రయాదవ్‌ విూడియాకు లీక్‌ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.