* పార్టీ వ్యతిరేకులను సస్పెండ్ చేయాలి

* కార్పొరేటర్లు, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల డిమాండ్

* పార్టీ జిల్లా అధ్యక్షునికి వినతిపత్రం అందజేత

మానకొండూరు, సెప్టెంబర్ 10 (జనం సాక్షి)

కరీంనగర్ నగర్ నగరపాలక సంస్థ 49, 51 వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన అన్న కూతురు కమల్ జిత్ కౌర్, భర్త సోహాన్ సింగ్ లు ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని, మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేస్తూ, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ,
తక్షణం వారిపై తగు చర్యలు తీసుకొని, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరపాలిక కార్పొరేటర్లు, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు వేరువేరుగా తెరాస జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణా రావుకు శనివారం వినతిపత్రం అందించారు. శనివారం సాయంత్రం జీ వి నివాసంలో సమావేశమై వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగరం లో నిరంతర నీటి సరఫరా అవుతుండగా, కుట్రపూరితంగా మంచినీటి సరఫరా పైపులను కట్ చేసి సమస్యలు సృష్టించారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఖాళీ బిందెల ప్రదర్శనతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరించారని ఆ వినతిపత్రంలో వివరించారు. జెసిబి తో రోడ్డును తవ్వి, మేయర్ ను, మంత్రిని, ప్రభుత్వాన్ని ఇరుకున పడే విధంగా వ్యవహరించారన్నారు. మంత్రిని ఏకవచనంతో సంబోధించడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాలలో గింగిరాలు తిరుగుతున్న దృశ్యాలు దేనికి సంకేతం అని వారు ప్రశ్నించారు. వీరి పై చర్యలకు డిమాండ్ చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ కు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సంతకాలతో కూడిన వినతి పత్రం అందిస్తామన్నారు. పార్టీ చిహ్నం పై గెలిచి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇకపై సహించేది లేదని వారు స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, సల్ల శారద రవీందర్, కా శెట్టి లావణ్య, కం సాల శ్రీనివాస్, కోల మాలతి, బోనాల శ్రీకాంత్ తదితరులు వినతి పత్రం అందించారు.

క్రమశిక్షణ తప్పితే సహించేది లేదు

పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు.

పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా సహించేది లేదని, నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరు తెరాస పార్టీ అని జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు అన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటానని, తనను కలిసిన కార్పొరేటర్లకు, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లకు జీవి రామకృష్ణ రావు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఈ ఎపిసోడ్ కు కు ముగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.