పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని బహిష్కరించాలి

సిఎం కెసిఆర్ కు లేఖ రాసిన మాజీ కార్పొరేటర్ ఎ.వి.రమణ

కరీంనగర్ (జనంసాక్షి): కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుండి బహిష్కరించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ కార్పొరేటర్, న్యాయవాది ఎ.వి.రమణ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కు మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విదంగా కరీంనగర్ నగర పాలక సంస్థలో కార్పొరేటర్ గా కొనసాగుతున్న శ్రీమతి కమలజీత్ కౌర్ భర్త సోహన్ సింగ్ కుట్ర చేస్తున్నారని లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వానికి, మంత్రి గంగులకు వ్యతిరేకంగా కొందరు చేస్తున్న కుట్రలు ఆడియో ద్వారా బహిర్గతమైందన్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ను కూడా ముఖ్యమంత్రికి పంపినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సోహన్ సింగ్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కు దగ్గరి బంధువు అనే విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. నీతీ, నిజాయితీకి కట్టుబడి అంకిత భావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి సహకారంతో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ను ప్రజలందరూ దగ్గరగా చూస్తున్నారని ఇలాంటి సందర్భంలో కుట్రలకు తెరలేపడం పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.