పార్లమెంటులో పదాల నిషేధంపై కెటిఆర్ ఆగ్రహం
వారిది నియంతృత్వ ధోరణి అంటూ విమర్శలు
హైదరాబాద్,జూలై16(జనం సాక్షి ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మొన్నటివరకూ ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర్కారు.. నిన్నటికి నిన్న పార్లమెంట్‌లో వాడకూడదంటూ కొన్ని పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై
కేటీఆర్ మండిపడుతూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎన్‌పీఏ(నాన్ పర్ఫార్మింగ్ అసెట్) గవర్నమెంట్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉదహరిస్తూ ట్వీట్ చేశారు. ఆందోళనకారులను ఆందోళన్ జీవి అని ప్రధాని పిలవడం వారి పార్లమెంట్ భాష అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓ మంత్రి వ్యాఖ్యానించిన గోలిమారో సాలోం కో అనే వ్యాఖ్యం, 80`20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించడం, మహాత్మాగాంధీని కించపరిచిన బీజేపీ ఎంపీ తీరు, ఆందోళన చేస్తున్న రైతులను అవమానపరుస్తూ.. వారిని టెర్రరిస్టులు అని సంబోధించడం.. వారి పార్లమెంట్ భాష అని కేటీఆర్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇకపై ’జుమ్లాజీవి’, ’కొవిడ్ స్పైడర్’, ’స్నూప్‌గేట్’, వంటి ఇంగ్లీష్ పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతోపాటు అవినీతి పరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను అన్ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి.