పార్లమెంటు అర్ధవంతమైన చర్చలకు వేదికకావాలి
– ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు కావస్తున్నందున ఈవర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 15న 70వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నామని, ఆ వేడుకకు ముందు ఈ సమావేశాలు జరగడం ఓ మైలురాయి అని మోదీ అన్నారు. మరికొద్ది రోజుల్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం రానున్న నేపథ్యంలో భారత పార్లమెంటులో అర్థవంతంగా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో తమ భుజానవేసుకొని సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు.కీలక నిర్ణయాలు వెలుబడుతాయని ప్రధాని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న మోదీకి పార్లమెంటు సభ్యులు, మంత్రలుఉ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని విూడియాతో మాట్లాడుతూ సమావేశాల్లో చర్చలు సమగ్రంగా జరిగేందుకు అన్ని పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఉన్నత ప్రమాణాలతో చర్చలు సాగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశాల గురించి గత కొన్ని రోజులుగా వివిధ పార్టీలతో చర్చలు జరిపామని, దేశాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు అందరూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని మోదీ అన్నారు. ఈ సారి జరగనున్న సమావేశాల్లో సుమారు 20 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీఎస్టీ బిల్లును ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తుచేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ వర్షాకాల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు భారత్‌ను ఓ కొత్త మార్గంలోకి తీసుకెళ్తాయని చెప్పారు.అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్ కుమార్ అన్నారు.
కొత్తమంత్రుల పరిచయం ..ఎంపి మృతికి సంతాపం
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రుల వివరాలు ప్రధాని మోదీ సభకు పరచియం చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన నాయకులకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాపం తెలియజేశారు.మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ఎంపీ దల్పత్ సింగ్ పరాస్తే మృతిపట్ల లోక్‌సభ సంతాపం ప్రకటించింది.మెదడులో రక్తస్రావం కారణంగా జూన్ 1న ఆయన మృతిచెందారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. దల్పత్‌సింగ్ పరాస్తే మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోపక్క, రాజ్యసభ సభ్యుడిగా వెంకయ్యనాయుడు ప్రమాణం చేశారు. హిందీ భాషలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, నిర్మలాసీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేశారు. టీజీ వెంకటేశ్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.