పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా
22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ
ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్ జాదవ్
ఆదిలాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు పనిచేసిన పార్లమెంట్
సభ్యులు ఏ హావిూ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల దృష్ట్యా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోందని, తాను పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. గతంలో ఎంపిలుగా ఉన్న వారు జిల్లా అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదన్నారు. జిల్లాలో సహజ వనరులున్నా వాటిని వినియోగించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటేస్తే పరోక్షంగా అది భాజపాకు వేసినట్టేనన్నారు. జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండు వద్ద గేటు, ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేశారన్నారు. కొత్త రైలు లైను, రైళ్లు మంజూరు చేయించలేదన్నారు. జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలిస్తే పార్లమెంట్ సభ్యులు మౌనం వహించారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాల మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. సిమెంటు పరిశ్రమ, విమానాశ్రయం పురోగతి పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని, దాని పునరుద్ధరణ గురించి మాత్రం విస్మరించారన్నారు. నిరుద్యోగ యువతను పట్టించుకోలేదన్నారు.