పాలనచేతకాకపోతే తప్పుకో
– బీఎస్పీ చీఫ్ మాయావతి
లక్నో,ఆగస్టు 1(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనతో… ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి, మాజీ యూపీ సీఎం మాయావతి యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూపీని మేనేజ్ చెయ్యడం నీ వల్ల కాకపోతే.. నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే పదవికి రాజీనామా చెయ్ అంటూ అఖిలేశ్‌పై మండిపడ్డారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన షీలాదీక్షిత్ కూడా అఖిలేశ్‌పై విమర్శలు చేశారు. ఢిల్లీ శివారు నోయిడాకు చెందిన కుటుంబం శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు వెళ్తుండగా.. దిల్లీకి కేవలం 65 కి.విూల దూరంలో రద్దీగా ఉండే 91వ నెంబరు జాతీయ రహదారిపై, అదీ పోలీసు చెక్‌పోస్ట్ సవిూపంలో ఈ దారుణం జరగడం చర్చనీయాంశంగా మారింది. సాయుధులైన దుండగులు ఇనుప రాడ్డును విసిరి కారును అడ్డగించారు. అందులోని పురుషులను, వృద్ధురాలిని తాళ్లతో కట్టేసి, 35 ఏళ్ల మహిళ, ఆమె 13ఏళ్ల చిన్నారిపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అయితే అసలు నిందితులను పట్టుకోలేదని అంటున్నారు.