పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి
నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి ఉమ్మడి పాలమూరు ప్రాంతంపై భారీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోనే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండడంతో గట్టి ఫోకస్‌ పెట్టింది. అందులోనూ పార్టీలో రాష్ట్ర స్థాయి గుర్తిం పు పొందిన నేతలందరూ కూడా పాలమూరు
వాసులే కావడంతో కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడి వారే. గత ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా వీచినా… పాలమూరులో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదురొడ్డి నిలిచింది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుపొందగా.. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలను గెలవాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే లక్ష్యంతో రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ప్రచారాన్ని ఉమ్మడి పాలమూరులోని అలంపూర్‌ నుంచే శ్రీకారం చుట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. ఒక వైపు మహాకూటమితో పొ త్తులకు చర్చలు సాగుతుండగా.. మరోవైపు పలు నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. గద్వాల, అలంపూర్‌, కొడంగల్‌, వనపర్తి, కల్వకుర్తిల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కావడంతో .. మరోసారి వారికే అవకాశం దక్కనుంది. టికెట్ల దరఖాస్తు విషయంలో కూడా ఆయా స్థానాల్లో ఎలాంటి పోటీ తలెత్తలేదు. మిగతా చోట్ల కూడా పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే ఇన్‌చార్జీలుగా ఉన్నారు. అయితే ఆయా స్థానాల్లో మరికొందరు అభ్యర్థులు సైతం టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో స్పష్టత లేకుండానే ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.  ప్రతీ రోజు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం ఉండేలా షెడ్యూల్‌ రూపొందించారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రచారం పూర్తి కానుంది. రాహుల్‌ రాక కారణంగా తాత్కాలికంగా ప్రచారాన్ని నిలిపివేశారు.