పాలమూరులో నివురుగప్పిన అసమ్మతి
నేతలను సముదాయిస్తున్న మంత్రులు
అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని హితవు
మహబూబ్‌నగర్,సెప్టెంబర్27(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. ఆయాచోట్ల ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. వీరిని బుజ్జగించి దారికితెచ్చుకునే యత్నా/-లలో నేతలు ఉన్నారు. కల్వకుర్తి, అలంపూర్, గద్వాల, మక్తల్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో అసంతృప్తనేతలు ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలు చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి అసంతృప్త నేతల నుంచి సెగ తాకుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసంతృప్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను ఇప్పటివరకు ముఖ్యనేతలు పిలిచి మాట్లాడకపోవడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళాలు రోజురోజుకు పెరుగుతుండడంపై ఆయన అనుచరులు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. /ూనున్న ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశించిన భంగపడిన వారిని ముఖ్యనేతలు రంగంలోకి దిగి సముదాయిస్తున్నారు. కల్వకుర్తిలో టిక్కెట్టు ఆశించి దక్కకపోవడంతో ఏకంగా బాలాజీసింగ్ అనుచరులు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మనే దగ్ధం చేశారు. అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయాణరెడ్డి అనుచరులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు సహకరించాలంటూ ఏకంగా మంత్రి కేటీఆర్ బుజ్జగించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఎమ్మెల్సీ కసిరెడ్డితో పాటు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్ విజితారెడ్డి తదితరులను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి సముదాయించారు. అలాగే అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితిని మంత్రి హరీశ్‌రావు సరిదిద్దారు. అలంపూర్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథం, అతని కుమారుడు మందా శ్రీనాథ్‌ను పిలిపించి భవిష్యత్‌లో పార్టీ మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గట్టు తిమ్మప్ప, బక్క చంద్రన్న, ఆంజనేయులు గౌడ్ వంటి నేతలను మంత్రి హరీశ్‌రావు పిలిపించుకుని పార్టీ అభ్యర్థి బండ్ల చంద్రశేఖర్‌రెడ్డికి సహకరించాలని సూచించారు. ఇలా మొత్తం విూద ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు కాస్త సద్దుమణిగాయి. అయితే మక్తల్‌లో అభ్యర్థిని మార్చే వరకు ఆందోళనలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను సముదాయించిన ముఖ్యనేతలు మక్తల్ విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాం శమైంది. తాజాగా టికెట్లను ప్రకటించిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను శాంతపరిచిన ముఖ్యనేతలు మక్తల్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందం టున్నారు. అంతేకాదు ఆందోళనను ముందుండి నడిపిస్తున్న వారందరూ.. పార్టీలోని జిల్లా ముఖ్యనేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతారనే ప్రచారం ఉంది.