పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం
– తొమ్మిది నెలల్లో ఐటీ టవర్‌ను పూర్తిచేస్తాం
– 15వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది
– ప్రాజెక్టులను అడ్డుకోవటమే కాంగ్రెస్ నేతల పని
– వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుండి కాంగ్రెస్ నేతలను తరిమేయాలి
– 14 స్థానాల్లో తెరాసను గెలిపించాలి
– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– మహబూబ్‌నగర్‌లో ఐటీ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి
మహబూబ్‌నగర్, జులై7(జనం సాక్షి) : ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో దివిటిపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. నేడు పాలమూరు జిల్లా చరిత్రలో లిఖించదగ్గ రోజు అని చెప్పారు. పాలమూరులో ఐటీ ఇండస్టీయ్రల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కులో దాదాపు 100 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఐటీ టవర్ నిర్మాణానికి 50 కోట్ల రూపాయాలు మంజూరు చేసి తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటు ద్వారా 15 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పోలెపల్లి పార్క్‌లో కూడా చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. 20వేల మంది పని చేస్తున్నారని, పాలమూరు పార్క్‌లో ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా పది నుంచి పదిహేను వేలమంది పని చేసే అవకాశం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉమ్మడి పాలమూరు జిల్లా రుణం తీర్చుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు అని తెలిపారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపుతున్నామని, యువతకు విద్యాఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎలా సాధించుకున్నామో.. అదే విధంగా పాలమూరు జిల్లాకు సంపూర్ణమైన న్యాయం సిద్ధించే వరకు కృషి చేస్తామన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ నాయకులలారా గాంధీలది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోన్న గద్వాలలో మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ తుమ్మిళ్ల గట్టు ఎత్తిపోతాల పనుల్ని ప్రారంభించారన్నారు. కర్ణాటకలో రైతు రుణమాఫీ ఒకేసారి చేసే సత్తా రాహుల్‌కు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో 14లక్షల మంది వలసలు పోయేవారని, పాలమూరుకు శాపం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కాదా అని .. అంటూ జైపాల్ రెడ్డి , డికె అరుణ, నాగం జనర్దన్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. పాలమూర్ ప్రాజెక్ట్ పనులు జరగకుండా కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, చరిత్రలో కనుమరుగవుతారని కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకున్నదన్నారు. గద్వాల
ప్రాంతన్ని సస్యశామలం చేస్తామని, ప్రతి ప్రాంతన్ని అభివృద్ది చేస్తామని కేటీఆర్ అన్నారు. ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ ముందుకు సాగుతున్నారన్నారు. కుటుంబ పాలన మాది కాదని, కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రన్ని మెచ్చుకుంటున్న రాష్ట్రలు ఏన్నో ఉన్నాయన్నారు. పాలమూరు పౌరుషాన్ని వచ్చే ఎన్నికల్లో చేపించేందుకు ప్రజలు సిద్ధం కావాలని, పాలమూరులో ఎంపీ స్థానాలతోపాటు 14 అసెంబ్ల స్థానాల్లో తెరాసను గెలిపించి కాంగ్రెస్ నాయకులు గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పెద్ద చెరువును అభివృద్ధి చేశాం..
పాలమూరు జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే చెరువులో కంపచెట్లు మొలిచేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా తయారు చేస్తున్నామని తెలిపారు. హుస్సేన్‌సాగర్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్ మాదిరి.. పెద్ద చెరువు వద్ద నిర్మించేందుకు రూ. 24 కోట్లు మంజూరు చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. జడ్చర్ల – మహబూబ్‌నగర్ మెయిన్‌రోడ్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ చైర్మన్, కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.