పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ

జైపాల్‌ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్‌
నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం?
మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునే యత్నాల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ నాగర్‌ కర్నూలునుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. మహబూబ్‌నగర్‌ నుంచి మళ్లీ జైపాల్‌ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. అలాగే రేవంత్‌ రెడ్డి, డికె అరుణ, చిన్నారెడ్డి లాంటి వారు కూడా లాబీయింగ్‌ మొదలు పెట్టారు. జైపాల్‌ రెడ్డి కాదంటేనే వీరి పేర్లను పరిశీలిస్తారు. అలాగే నాగర్‌ కర్నూలు నుంచి మళ్లీ నంది ఎల్లయ్యకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయనే మళ్లీ పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఇటీవల జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తుంచారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేపట్టనున్న ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇన్‌చార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.  టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేసి మైనార్టీలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులను చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాత్రాన నేతలు, కార్యకర్తలు ఆందోళన పడొద్దని, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కష్టపడాలని పిలుపునిచ్చారు.పార్లమెంట్‌ ఎన్నికల కంటే 45 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించాలని మెజార్టీ నేతలు ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇక సీనియర్లతో చర్చించి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాపై చర్చించారు. నేతల అభిప్రాయం మేరకు సాధ్యమైనంత తక్కువ మందితో జాబితాను అందజేయాలని చెప్పినట్లు సమాచారం.