పాస్‌బుక్ ఉన్న ప్రతీ రైతుకు బీమా
– ఆగస్టు 15నుంచి బీమా సౌకర్యం
– ఏ కారణంతో రైతు చనిపోయినా రూ. 5లక్షల బీమాసొమ్ము
– రైతుల పక్షపాతి కేసీఆర్
– మంత్రి తన్నీరు హరీష్‌రావు
వికారాబాద్, మే28( జనం సాక్షి ) : వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి పట్టాదార్ పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తామని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఏ కారణంతో రైతు చనిపోయినా రూ. 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి చెప్పారు. నవాబ్‌పేట మండలం చించల్‌పేట గ్రామంలో రూ. 3.30 లక్షల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం మంత్రులు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ఉద్ఘాటించారు. రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4 వేల
పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు రైతులకు రూ. 5లక్షల ఉచిత బీమా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా.. రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. చించల్‌పేటలోను 643 మంది రైతులకు రూ. 80 లక్షలు రైతుబంధు పథకం ద్వారా అందించామన్నారు. యాసంగి పంటకు మరో రూ. 80 లక్షలు ఇస్తామన్నారు. గ్రామ ప్రజలు ఎస్‌బీఐ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. చించల్‌పేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.