పింఛన్ల పంపిణీలో ఏపీనే నెంబర్ వన్
– ప్రతి యేటా రూ.6వేల కోట్లు అందిస్తున్నాం
– పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆత్మగౌరవం పెంచాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మే31(జనం సాక్షి) : దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధప్రదేశ్‌నని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సవిూక్షించారు. తన నివాసం నుంచే ముఖ్యమంత్రి.. పింఛన్ల పంపిణీపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందికి పింఛన్లు ఇస్తున్నారు.. కొత్తగా ఎన్ని పింఛన్లు మంజూరుయ్యాయని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 47,26,341 మందికి ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 33,722మంది మత్స్యకారులకు తక్షణమే పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది రూ.6వేల కోట్లకు పైగా పింఛన్లకు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీనేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పింఛన్ల పంపిణీపై ప్రజల్లో 80శాతం సంతృప్తి ఉందన్నారు. పింఛన్ల ద్వారా లబ్దిదారుల్లో ఆత్మగౌరవం పెంచామని చెప్పారు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ జరిగేలా శ్రద్ధ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్ఫథంతో సంక్షేమ శాఖ యంత్రాంగం పనిచేయాలని కోరారు. రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా 50లక్షల కుటుంబాలకు రూ.6వేల కోట్లు అందిస్తున్నామని.. పేదల సేవే మన పరమావధిగా భావించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదన్నారు.