పిచ్చి కూతలు, పిచ్చి రాతలు మానండి
– అభివృద్ధి మరింత వేగవంతం చేస్తాం
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): ప్రతిపక్షాలు చేసిన పిచ్చి కూతలు, ఆంధ్రా పత్రికలు రాసిన పిచ్చి రాతలను ప్రజలు నమ్మలేదని ఈ ఎన్నికల ఫలితం నిరూపించిందన్నారు. ప్రతిపక్షాలకు వరంగల్ ప్రజలు మంచి బుద్ది చెప్పారని సిఎం కెసిఆర్ అన్నారు.తెలంగాణభవన్‌లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విూడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విజయం తమ బాధ్యతను మరింతగా పెంచిందని, మరింత ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ప్రతిపక్షాలు ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. వరంగల్ ప్రజలు అపూర్వ తీర్పు ఇచ్చారని శ్లాఘించారు. రైతుల రుణమాఫీ విషయంలో ఓ పత్రిక పిచ్చిరాతలు రాస్తే తెలంగాణ నేతలు వాటిని పట్టుకుని ఊగులాడరని విమర్శించారు. తాను సీఎం అయిన ఐదో రోజునే తన దిష్టిబొమ్మను దహనం చేయించి ఆంధ్రా పత్రిక దాష్టీకానికి పాల్పడి నీచ సంస్కృతిని ఏర్పరిచిందన్నారు. సీఎం అయిన ఐదో రోజే దిష్టిబొమ్మను దహనం చేసిన చరిత్ర దేశ రాజకీయాల్లోనే లేదని వివరించారు. వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ అపూర్వ విజయం ప్రజలిచ్చిన పాజిటివ్ దృక్పథానికి నిదర్శనమని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ ఎన్నికలో వచ్చిన ఓట్లు కొనుక్కుంటేనే లేదా బెదరిస్తేనే వచ్చినవి కాదన్నారు. ప్రజలు సానుకూల దృక్పథంతో ఇచ్చినవని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలు ఉద్యమకాలంలో, ఇవాళ టీఆర్‌ఎస్‌తోనే ఉన్నామని తెలిపారని అన్నారు. ఇదే పంథాను మన రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు కొనసాగించాయని మండిపడ్డారు. వివిధ అభివృద్ది పనులకు తాను శ్రీకారం చుట్టిన ప్రతిసారీ విపక్షాలు అడ్డుపడ్డాయని, విమర్శలు చేశాయని అన్నారు. ఇలా ప్రతి విషయాన్ని గమనించిన ప్రజలు వరంగల్ ఎన్నికల్లో తీర్పును ఇచ్చారని అన్నారు. దీనిని తాము ఆషామాషీ విజయంగా భావించడం లేదన్నారు. అందుకే వరంగల్ ఉపఎన్నిక ఫలితాన్ని అపురూప విజయంగా భావిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజలు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో తీర్పు ఇచ్చారని, ఎవరికీ రాని మెజార్టీని ఇచ్చి తెరాస అభ్యర్థిని గెలిపించారని పేర్కొన్నారు. వరంగల్ ఎన్నిక తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. రైతుల రుణమాఫీపై తాము చెప్పని విషయాన్ని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారు. వారి ఉద్దేశాన్ని ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా ఆంధ్రా పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రీడిజైన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దశబ్దాల నుంచి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో తెలంగాణకు నీళ్లు ఇచ్చే పథకాలు పెట్టలేదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. పండుగలు, అన్ని మతాలను గౌరవించేలనేది ప్రభుత్వ ఆలోచన. రైతుల రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.8వేల కోట్లు విడుదల చేశాం. రైతుల కోసం రూ.17 వేల కోట్లు రుణమాఫీ అమలు చేస్తాం. మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ చేపడితే దాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ అడ్డంకులు
సృష్టిస్తున్నారు. విపక్షాలు ఇప్పటికైనా అసత్య ప్రచారాన్ని మానుకోవాలి అని కేసీఆర్ హితవుపలికారు.
త్వరలో డీఎస్పీ ప్రకటన
తెలంగాణలో త్వరలోనే డీఎస్సీ ప్రకటన వెలువరిస్తామని కేసీఆర్ వెల్లడించారు. పెండింగ్ డిఎస్సీలకు కూడా పోస్టులు ఇస్తామని అన్నారు. వారం రోజుల్లో ఉద్యోగుల విభజన పక్రియ పూర్తవుతుందని, రెండు నెలల్లోగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హావిూ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా 2 లక్షల మంది పేదలకు దుస్తులు పంపిణీ చేస్తామని, అన్ని నియోజకవర్గాల్లో భోజనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలు, అగ్రవర్ణాల పేదలకు అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెరాసలో నామినేటెడ్ పోస్టులను నెలరోజుల్లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. పటిష్ఠ రాజకీయ సంస్థగా తెరాసను తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడతామని, జిల్లాల్లో ఎక్కువగా పర్యటిస్తానని తెలిపారు. సీఎం, మంత్రులు బస్సు యాత్రల ద్వారా ప్రజలతో మమేకమవుతారని పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌పై అని తెలిపారు. ఇవన్నీ ఆంధ్రా పాలకుల హయాంలో జరిగాయని ఈ అన్యాయాలను సరిచేసేందుకు తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నేఈరు పారిస్తామని అన్నారు. ప్రాజెక్టుల వద్దే కుర్చీ వేసుకుని కూర్చుంటానని అన్నారు. కొత్త రాష్ట్రానికి కావాల్సిన వాటిని అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మాకు తెలంగాణ రాష్ట్రానికి కొత్త పునాదిరాయి వేయమని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గొంతులో ప్రాణం ఉండగా తప్పుచేయమని వాగ్దానం చేశారు. తెలంగాణలో కరువు శాశ్వతంగా దూరం కావాలని అన్నారు. ఏపీ సీఎంలు తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు నిజమైనవి కావని తెలిపారు. కేవలం కాగితాల విూద ఇచ్చిన ప్రాజెక్టులు మాత్రమేనని వివరించారు. ఆనాడు వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతాయని తెలిసి కూడా వీటిని చేపట్టారని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతదని తెలిసి కూడా ఈ ప్రాజెక్టును చేపట్టారని వివరించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాలువలు కూడా తవ్వారని వాటిలో పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయని పేర్కొన్నారు. ఆనాడు తాను ఎన్నికల ప్రచారంలోనే ప్రాణలున్నంత వరకు ప్రాణహిత రాదని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మా మునివళ్లు కూడా ప్రాణహిత నీళ్లు తాగరని తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయన్నారు. ఆనాడు టీఆర్‌ఎస్‌పైనే అబాంఢాలు వేశారని తెలిపారు
విపక్షాల విపరీత ధోరణితమ ప్రభుత్వం ఏ మంచి పని చేద్దామన్నా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఏ పనిచేద్దామన్నా మొదలు అడ్డుపడటం నేర్చుకున్నాయన్నారు. సెక్రటేరియట్ ఇరుకుగా ఉంది చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌లో పెట్టి చెస్ట్ ఆస్పత్రి స్థలంలో విశాలమైన సెక్రటేరియట్ కట్టుకుందామని అంటే నానా రభస చేశారని దుయ్యబట్టారు. హుస్సేన్‌సాగర్‌ను ఆంధ్రాపాలకులు కంపుతో నింపారని దానిని ప్రక్షాళన చేద్దామంటే తామేదో తప్పు చేస్తున్నట్టు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారని వివరించారు. మేం బాగు చేస్తామంటే అడ్డుతగులుతారు ఇదేం సంస్కృతి ప్రతిపక్షాలదని నిలదీశారు. బతుకమ్మ పండుగకు నిధులు కేటాయిస్తే సీఎం నీ కూతురు బతుకమ్మకు కేటాయించావా? అని కూతలు కూశారని అన్నారు. బతుకమ్మ పండుగను సీఎం కూతురు ఒక్కతే ఆడుకోదు కదా, తెలంగాణ ఆడపడుచులంతా అడుతారని వారికి తెలియదా? అని నిలదీశారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా చేద్దామంటే అదేందుకు అనడం నేర్చుకున్నారని మండిపడ్డారు. ఇవన్నీ గమనించిన ప్రజలు గట్టి తీర్పును ఇచ్చారని అన్నారు. ఇది పాజిటివ్ ఓటని అన్నారు.