పిల్లలకు అవగాహన కల్పించాలి

ఏలూరు, జూలై 19:విద్యార్థిదశ ప్రారంభం నుండి పిల్లలకు చట్టాలపట్ల అవగాహన పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి. లక్ష్మీశారద అన్నారు. గురువారం జిల్లాకోర్టు కార్యాలయం జిల్లా న్యాయసేవాధికారసంస్థ సమావేశ మందిరంలో ఓరియెంటేషన్‌ కోర్సు ఆన్‌ లీగల్‌ సర్వీసెస్‌ కార్యక్రమంలో హైస్కూలు సోషల్‌ సైన్సెస్‌ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పి. లక్ష్మీశారద మాట్లాడుతూ సమాజంలో పిల్లలు అభివృద్ధి చెందాలంటే చట్టాలపట్ల అవగాహన తప్పనిసరి అని 9వ తరగతి చదివే ప్రతీ విద్యార్థికి చట్టాలపట్ల అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని సోషల్‌ సైన్సెస్‌ ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి వారిద్వారా గవర్నమెంట్‌ ఎయడెట్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌,ప్రభుత్వ హైస్కూల్స్‌ విద్యార్థినీ విద్యార్థులకు చట్టాలపట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆమె చెప్పారు. మొదటి దశగా ఏలూరు, పెదపాడు, పెదవేగి, భీమఢోలు, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లోని హైస్కూలు విద్యార్థినీ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన కలిగించేందుకు ఏలూరు డివిజన్‌నందలి సోషల్‌ సైన్సెస్‌ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో పదిలక్షల రూపాయల లోపు విలువచేసే కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉందని జిల్లాకోర్టులో పదిలక్షల రూపాయలకు పైన విలువ చేసే కేసులను పరిష్కరించుకోవాలని, భూమి తగాదాలు విషయంలో భూమి ఎక్కడ ఉంటే ఆ ప్రాంత కోర్టులోనే కేసులు పరిష్కరించుకోవాలని ఆమె ఉపాధ్యాయులకు చెప్పారు. అనంతరం జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి డా. సిహెచ్‌. సూర్యచక్రపాణి మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తికాని పిల్లలు పనిలోకి వెళ్లడానికి అనర్హులని ఒకవేళ వారు పనిలోకి వెళ్లవల్సిన పరిస్థితి కలిగితే వారు కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. సమాచారహక్కు చట్టం కింద ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని మాత్రమే సేకరించాలని నిరుపయోగంగా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించరాదని ఆమె తెలిపారు. బాధ్యత గల పౌరులుగా సమాచారహక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని ఆమె చెప్పారు. చిన్నవయస్సులో ఉన్న పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యానేరమని తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి వివాహ వయస్సు వచ్చేవరకూ పిల్లలకు వివాహం చేయకూడదని ఆమె సూచించారు. స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ యన్‌. శేషురత్నకుమార్‌ మాట్లాడుతూ ఈమెయిల్‌, ఇంటర్నెట్‌ల ద్వారా ఇటీవల అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి బారినపడి ఎంతోమంది తప్పుదోవపడు తున్నారని, వీటిని నిర్మూలనకు పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి అనే అంశంపై ఉపాధ్యాయులకు వివరించారు. ఏటూరు అడ్వకేట్‌ శ్రీ జి. రోనాల్డ్‌రాజ్‌, భీమఢోలు, పెదవేగి, దెందులూరు హైస్కూల్‌ సోషల్‌ సైన్సెస్‌ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.