పిల్లల ప్రశ్నలకు సమాధానం వెతకాలిప్రశ్న

అంటూ లేనప్పుడు మానవ మనుగడ, పురోగతి ఉండదు. ప్రతి వ్యక్తికీ బాల్యం ఒక అందమైన దశ. ఏ భయాలు, కల్మషాలు అంటవు. బాల్యంలోనే ఏకాగ్రత, ఆసక్తి అనేవి నిండుగా, మెండుగా ఉంటాయి. ఏదైనా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు పిల్లల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని వికసింపజేయాల్సిన బాధ్యత పెద్దలదే! ఒక్కొక్కసారి బాలలు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఎలా చెప్పాలో తెలియక పెద్దవారు సతమతమవుతుంటారు. విద్యాలయాల్లో పిల్లలూ పలు ప్రశ్నలు గుప్పిస్తుంటారు. వాటికి ఉపాధ్యాయులు ఓపికగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేయాలి.’ఎందుకు’ అనేది హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించడాన్ని నేర్పుతుంది. మనిషి నిరంతర విద్యార్థి. విషయాలు తెలుసుకోవాలన్న అనురక్తి అతడిలో ఉండాలి. తనకు తెలిసినవాటిని ఎదుటివారికి విశ్లేషించి చెప్పగలగడం అతడి జ్ఞాన వికాసానికి దోహదపడుతుంది. పురాణాలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నప్పుడు, ప్రవచనాలు వింటున్నప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు అంకురిస్తాయి. సమాధానాలు తెలిసేదాకా, అవి మెదడును తొలిచేస్తుంటాయి. జ్ఞానానికి ఎల్లలు లేవు. అది పొందడానికి చిన్న, పెద్ద తారతమ్యం ఉండదు. అవసరమైనప్పుడు పిన్నల నుంచి అడిగి తెలుసుకోవడాన్ని ఎవరూ ఆత్మన్యూనతగా భావించనక్కర్లేదు.