పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ
తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు
ఊహించని షాక్‌తో పరకాల పరార్
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం రుచి చూపించారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు నీళ్లు నమలడం ఆ సమైక్యవాది వంతైంది. అప్పటి వరకు గొంతు చించుకుని అరిచిన ప్రభాకర్ చివరకు సమావేశాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. సమైక్య మూక పరకాల ప్రభాకర్ అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ అంశంపై చర్చిద్దామని ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా ఆ సమైక్యవాదులు తమ బుద్ధిని చూపించారు. తెలంగాణ అంశంపై చర్చ ఉంటుందని పిలిచి, అక్కడ కూడా సమైక్యాంధ్ర వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ముద్రించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా, ప్రసంగించడానికి లేచి మైకు పట్టుకున్న పరకాల ప్రభాకర్ తెలంగాణ ఏర్పాటుతో అన్నీ నష్టాలే అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో సమావేశానికి హాజరైన తెలంగాణవాదులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే, ఒక్కసారిగా సమావేశం ‘జై తెలంగాణ’ అన్న నినాదాలతో మారుమోగింది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి సమైక్యవాదులకు చెమటలు పట్టాయి. తర్వాత ప్రభాకర్‌పై తెలంగాణ బిడ్డల ప్రశ్నల దాడి మొదలైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన న్యాయమేమిటో తెలుపాలని డిమాండ్ చేశారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు తెలంగాణరాష్ట్రం కోసం చనిపోయినా, సీమాంధ్ర నాయకులు ఎందుకు స్పందించ లేదో చెప్పాలని పట్టుబట్టారు. సమైక్య రాష్ట్రం వద్దంటూ ఇక్కడి యువత ప్రాణాలు తీసుకుంటున్నా, మీరు సమైక్య రాష్ట్రం కోసం ఎందుకు పోరాడుతున్నారో చెప్పాలని తెలంగాణవాదులు నిలదీశారు. తెలంగాణ బిడ్డలు తమకు అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు, మరి పరకాల ప్రభాకర్ సమైక్య రాష్ట్రం కోసం ఎందుకు ఉద్యమిస్తున్నారో తెలుపాలని డిమాండ్ చేశారు. నీళ్ల కోసమా, ఉపాధి కోసమా, పరిశ్రమల కోసమా దేని కోసమో చెప్పాలని ప్రభాకర్‌కు ఊపిరాడనివ్వకుండా చేశారు. దీంతో కంగుతిన్న ప్రభాకర్ సమాధానం చెప్పే దారి కనబడక, నవ్వుతూ, చేతులూపుతూ, దిక్కులు చూస్తూ ఉండిపోయాడు. తెలంగాణవాదుల ప్రశ్నల దాడితో సమావేశం జరుగుతున్న ప్రెస్‌క్లబ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని తెలంగాణవాదులను శాంతింప చేయడానికి ప్రయత్నించారు. కానీ, తెలంగాణవాదులు చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టగా, చేసేదేమీ లేక పోలీసుల రక్షణలో పరకాల ప్రభాకర్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఏదో మాట్లాడి, ఉద్రేకంగా ప్రసంగించి, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని చెప్పాలనుకున్న పరకాలకు తెలంగాణవాదుల దెబ్బకు నెత్తి బొప్పి కట్టినంత పనైంది.