పుస్తకం మస్తకానికి నేస్తం

(14 నవంబర్ 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా…

ఒక మంచి పుస్తకం చక్కని  జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానం ద్వారా వివేకం అలవడుతుంది. వివేకం మనలో విచక్షణాజ్ఞానాన్ని పెంచుతుంది. సంస్కారాన్ని ప్రోది చేస్తుంది. సంస్కారం వలన సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వాతావరణం నెలకొంటుంది. మంచి అలవాట్లతో,  ఎలాంటి సమస్యలు లేని ఆరోగ్యవంతమైన, శాంతియుతమైన దేశ నిర్మాణం జరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూరడం కేవలం మంచిని పెంపొందించే పుస్తకం వలనే సాధ్యం.ఇలాంటి పుస్తకాలను,పుస్తక పఠనాన్ని  వదలి మస్తకాలను అనవసరమైన విషయాలతో, మలినమైన ఆలోచనలతో నింపడం క్షేమదాయకం కాదు.ప్రాచీన కాలంలో అనేక విషయాలను రాతి కట్టడాల మీద, లోహాల పైన, తాటాకుల పైన లిఖించేవారు. కాగితం,ముద్రణా యంత్రాలు కనిపెట్టిన తర్వాత దేశ విదేశాలకు చెందిన అనేక చారిత్రక,సాంస్కృతిక అంశాలు మత గ్రంథాలు, చారిత్రకాంశాలతో కూడిన విషయాలు, విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు ముద్రితమై అందుబాటు లోకి వచ్చాయి.సాంకేతిక వ్యవస్థ విస్తృతంగా వ్యాప్తి చెందడం,ఆధునీకరణ సంతరించుకోవడంతో  పుస్తకాలు వర్తమానానికి బరువుగా మారిపోయాయి. పుస్తక పఠనం అటకెక్కింది.  గ్రంథాలయాల ప్రాధాన్యం తగ్గిపోయింది.
గ్రంథాలయాలు- జ్ఞానానికి వేదికలు
గ్రంథ పఠనం అజ్ఞాన హరణం. గ్రంథాలయాలు ఇలలో కొలువైన దేవాలయాలు.
విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రయుధమైతే, అజ్ఞాన గాడాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. అక్షరజ్ఞానం,పుస్తక జ్ఞానం లేని మానవ జన్మ నిరర్థకం.  దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే  ఇలలో నెలవైన నిజమైన దేవాలయం గ్రంథాలయం.దేశ స్వాతంత్య్రోద్యమం లోను, సాంఘిక దురాచారాల నుండి మేల్కొలపడం లోను, తెలంగాణలో ఒకప్పటి నిజాం నిరంకుశ పాలన వలన నెలకొన్న అస్థవ్యస్థ పరిస్థితులనుండి కాపాడి,ప్రజలను జాగృత పరచడంలోను గ్రంథాలయోద్యమం పాత్ర అనిర్వచనీయం. ఎంతో మంది అభ్యుదయ వాదులు,సంఘసంస్కర్తలు గ్రంథాలయోద్యమం లో పాల్గొని గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేసారు. అయ్యంకి వెంకట రమణయ్య తెలుగు వారికి సుపరిచితం. గ్రంథాలయాల ద్వారా  ప్రజల్లో సామాజిక స్ఫృహ కలిగించాలనే  ఉద్దేశ్యంతో  అవిశ్రాంత కృషి చేసి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొంది, ఆచంద్రతారార్కమైన ఖ్యాతి నార్జించిన “అయ్యంకి” జనహృదయాల్లో పెల్లుబికిన చైతన్య స్రవంతి.ఆంధ్ర ప్రదేశ్ లో 1886 వ సంవత్సరంలో విశాఖ పట్టణం లో  స్థాపించిన పౌర గ్రంథాలయం తొలి గ్రంథాలయం గా పిలవబడుతున్నది. అయితే అంతకు ముందు కూడా అనేక గ్రంథాలయాలు స్థాపించబడినట్టు గ్రంథాలయ చరిత్ర విశదీకరిస్తున్నది. గ్రంథాలయం అయ్యంకి మానస పుత్రిక.విజయవాడ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ 1914 లో ఏర్పడింది.వేటపాలెం లో ఏర్పడిన సారస్వత నికేతనం  గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి.కేరళ లోని” త్రివేండ్రం పబ్లిక్ లైబ్రరీ” ని  ఇండియాలో మొదటి లైబ్రరీ గా పిలుస్తారు.తెలుగు రాష్ట్రాల్లో 1872 లో సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రాచీన  గ్రంథాలయం గా పేరుగాంచింది.కొమర్రాజు లక్ష్మణరావు కూడా   గ్రంథాలయ ఉద్యమానికి విశేషమైన కృషి చేసాడు. తెలంగాణాలో సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ గొంతు “కాళోజీ” గ్రంథాలయోద్యమం లో  ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు. అనేక ఉద్యమాల ప్రభావంతో అప్పటి  నల్గొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం,వరంగల్ లో ఆంధ్ర భాషా నిలయం ఏర్పడ్డాయి.తెలంగాణ లో గ్రంథాలయ ఉద్యమం ఆలస్యంగా ప్రారంభమైనా తర్వాత క్రమంలో అత్యంత క్రియాశీలకంగా మారింది.హైదరాబాద్ లోని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక పురాతన గ్రంథాలయం.గ్రంథాలలోనే నిజమైన విజ్ఞానం నిగూఢమై ఉన్నది.మన ఆలోచనా సామర్థ్యం పెరగడానికి పుస్తకపఠనమే నిజమైన మితృడు.వర్తమానంలో జరుగుతున్న  ప్రాపంచిక సంఘటనలు,గతంలో జరిగిన వాస్తవ సంఘటనలను గ్రంథస్థం చేసి,రాబోయే తరాలకు అందించడమే చరిత్ర. చరిత్ర అనేది బ్రహ్మపదార్ధమేమీ కాదు.చరిత్ర అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్ఠినట్టుగా విశదీకరిస్తూ అక్షర రూపమిస్తూ, గ్రంథస్తం చేసి, భవిష్య తరాలకు అందించే ఒక విశిష్ట ప్రక్రియ. గతంలో చాలామంది కవులు తమ మస్తిష్కంలో మెదిలే ఆలోచనలకు,కల్పనలకు  అలంకారాలను జోడిస్తూ హృదయానికి హత్తుకునేటట్టు వివిధ రూపాల్లో  తమ కున్న ప్రతిభావ్యుత్పత్తులతో  జన రంజకమైన రచనలు చేసేవారు. తమ మేధస్సుకు పదును పెట్టి ఆణిముత్యాల వంటి కథాకథనంతో  పద్య,గద్య,శిల్ప ,చిత్ర,కావ్య రూపాల్లో నాటి సృజనాత్మక శిల్పకారులు,చిత్రకారులు,కవులు  విజ్ఙానాన్ని నిక్షిప్తం చేసేవారు.
నాటి రచనలు, పద్య,గద్య రచనలు, కావ్యాలు ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి. అందుకే మన ప్రాచీనకాలానికి  చెందిన గ్రంథాలు ఈనాటీకీ పండిత పామరుల చేత కొనియాడబడుతూ, విశేష జనాదరణ పొందుతున్నాయి. బహుళ ప్రాచుర్యం లో ఉన్నాయి.
సాంకేతిక విజ్ఞానం క్రొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో
గ్రంథ పఠనం కనుమరుగై పోతున్నది.ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని, విజ్ఞాన సముపార్జన ద్వారానే మానసిక వికాసం కలుగుతుందని,సమాజ పురోభివృద్ధి పుస్తకపఠనం ద్వారానే సాధ్యమవుతుందని ఎంతో మంది విజ్ఞులు ఒక అవగాహనకు వచ్చి, అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలని, అందుకోసం స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఉద్యమించారు. వారి పోరాటఫలితమే గ్రంథాలయాల ఆవిర్భావం.గ్రంథాలయాల ఆవిర్భావం కోసం గ్రంథాలయోద్యమం జరిగింది.నాటి గ్రంథాలయోద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. అయ్యంకి వెంకటరమణయ్యను భారతీయ గ్రంథాలయోద్యమ రూపశిల్పిగా చరిత్ర పేర్కొంటున్నది. ఇండియన్ లైబ్రరీ అసోషియేషన్ ఆవిర్భవించడానికి, జాతీయస్థాయి సమావేశాలకు అది వేదిక కావడానికి ఆద్యుడు అయ్యంకి వెంకట రమణయ్య.కొమర్రాజు లక్ష్మణ రావు,గాడిచర్ల హరిసర్వోత్తమరావు,వెలగా వెంకటప్పయ్య,పాతూరి నాగభూషణం, బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి మహనీయులెందరో  గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహించారు. నవంబర్ 14 వతేదీ నుండి  జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. గ్రంథాలయ వారోత్సవాలు ఆనవాయితీ గా కాకుండా ఒక లక్ష్యం దిశగా సాగాలి. విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. మరో గ్రంథాలయోద్యమం ప్రారంభం కావలసిన అవసరం ఏర్పడింది. చరవాణి పుస్తక స్థానాన్ని ఆక్రమించింది. మన ఆలోచనలకు పదును పెట్టి,మానసిక వికాసం కలిగించిన గ్రంథాలయాలు వెల వెలబోతున్నాయి.మన  మేథస్సును హరించి, మన ఆలోచనలకు తావులేని మర బొమ్మలుగా తయారు చేస్తున్న సాంకేతిక పరికరాలకు  కొంతవరకు విశ్రాంతినిచ్చి, పుస్తక పఠనానికి గవాక్షాలు తెరవాలి. గ్రంథాలయాలు మన పురాతనమైన వెలకట్టలేని ఆస్తిపాస్తులు.వాటిని కాపాడుకోవాలి. పుస్తక పఠనం పై నేటి విద్యార్థికి ఆసక్తిని కలిగించాలి. మనోవికాసానికి గ్రంథాలయాలే ఆలవాలం. పుస్తక పఠనమే మన ఆలోచనా నేత్రాల సక్రమ వీక్షణకు సవ్యమైన మార్గం. అజ్ఞానానికి నిజమైన ఔషధం విలువైన పుస్తకం. గ్రంథాలయ వారోత్సవాల స్ఫూర్తి  గ్రంథాలయాల ఆవశ్యకతకు దోహదం చేయాలి.గ్రంథాలయాల పునరుజ్జీవానికి, గ్రంథ పఠనానికి తగినంత ప్రాధాన్యత, ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.నవంబర్14 వ తేదీన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు గ్రంథ పఠనంపై ఆసక్తి కలిగించాలి.  గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వివరించాలి.
-సుంకవల్లి సత్తిరాజు.
(సోషల్ఎనలిస్ట్,కాలమిస్ట్)
మొబైల్- 9704903463

ఈ వ్యాసం  నా స్వీయ రచన ఈ క్రింది ఫోటోతో  ప్రచురించగలరు.
ధన్యవాదములు.

-సుంకవల్లి సత్తిరాజు.
సంగాయగూడెం,
దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా,
ఆం.ప్ర.
.